సాక్షి క్రీడా విభాగం: ‘ఒక్క టెస్టులో ఓడిపోగానే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లు అందరూ భావిస్తే నేనేమీ చేయలేను’... తొలి టెస్టులో పరాజయం తర్వాత కెప్టెన్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. అయితే గతంలో చాలా సార్లు చెప్పినట్లుగా ఓటమి కంటే ఓడిన తీరు అందరికీ నిరాశ కలిగించిందనడంలో సందేహం లేదు. 2018–19 సీజన్‌లో ఆస్ట్రేలియా చేతిలో పెర్త్ టెస్టు కోల్పోయిన తర్వాత భారత్ టెస్టుల్లో ఓడటం ఇదే తొలిసారి. అప్పుడు మ్యాచ్ ఓడినా... చివరకు సిరీస్ సొంతం చేసుకొని టీమిండియా చరిత్ర సృష్టించింది. 2019లో ఒక్క పరాజయం కూడా లేకుండా టీమ్ జోరు సాగింది. ఇందులో బలహీన వెస్టిండీస్‌పై ఆ దేశంలోనే సాధించిన రెండు విజయాలతో పాటు స్వదేశంలో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై గెలిచిన ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఏడాదిని మాత్రం జట్టు ఓటమితో ప్రారంభించింది.
పరుగులే రాలేదు...
తొలి రోజు పిచ్‌పై కాస్త పచ్చిక, వాతావరణంలో తేమ కనిపించగానే మన బ్యాట్స్‌మెన్ మానసికంగా బలహీన పడిపోయారా అనిపించింది. మన బ్యాట్స్‌మెన్ ‘అతి జాగ్రత్త’ కూడా జట్టుపై ఒత్తిడి పెంచినట్లు కనిపిస్తోంది. ఆరంభంలో నిలదొక్కుకునే వరకు పర్వాలేదు గానీ ఆ తర్వాత కూడా స్కోరింగ్ షాట్లపై వారు దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా పుజారా స్థాయి ఆటగాడు టెస్టును ‘డ్రా’ చేసుకునేందుకు ఆడినట్లు కనిపించిందే తప్ప స్కోరు బోర్డుపై పరుగులు కూడా ముఖ్యమనే అంశాన్ని విస్మరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల కోసం 42 బంతులు ఆడిన అతను రెండో ఇన్నింగ్స్‌లో అవే 11 పరుగుల కోసం 81 బంతులు తీసుకున్నాడు. విహారి కూడా 15 పరుగుల కోసం 79 బంతులు ఆడాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో డ్రా కోసం ఆడే సమయంలో ఇది సరైన వ్యూహం కావచ్చేమో కానీ పరుగులే చేయకుండా క్రీజ్‌లో పాతుకుపోవడం వల్ల ప్రయోజనం లేదు. విదేశీ గడ్డపై తొలి టెస్టు కాబట్టి పృథ్వీ షాను క్షమించేయవచ్చని కెప్టెన్ ముందే చెప్పేశాడు. కానీ పృథ్వీ తాను సెహ్వాగ్ కాదనే విషయాన్ని గుర్తించి టెస్టు క్రికెటర్‌గా ఆడాలని తెలుసుకోవాలి. చకచకా 18 బంతుల్లో 16 పరుగులు చేసేసి వెళ్లిపోవడం ఏ రకంగా కూడా ఒక ఓపెనర్ చేయాల్సిన పని కాదు. కోహ్లి అరుదైన వైఫల్యం కూడా ఓటమికి కారణాల్లో ఒకటి. మయాంక్, రహానే కొంత పట్టుదల కనబర్చినా అది జట్టును రక్షించేందుకు సరిపోలేదు.
బుమ్రా వైఫల్యంతో...
జొహన్నెస్‌బర్గ్, నాటింగ్‌హామ్, అడిలైడ్, మెల్‌బోర్న్... గత నాలుగు చిరస్మరణీయ విదేశీ విజయాల్లో భారత పేసర్లు పోషించిన పాత్ర ఎంతో గొప్పది. పిచ్ ప్రత్యర్థి తమకు అనుకూలంగా సిద్ధం చేసుకున్నా అక్కడ మన పేసర్లే చెలరేగిపోయి ఫలితాన్ని మార్చేయగలిగారు. ఈ సారి న్యూజిలాండ్‌లో తొలి టెస్టులో అది జరగలేదు. ఇషాంత్ ఐదు వికెట్లు తీసినప్పటికీ షమీ, బుమ్రాల వైఫల్యం జట్టును బలహీనంగా మార్చింది. మనవాళ్లు వంద శాతం స్వింగ్ బౌలర్లు కాకపోవడం కూడా ఒక కారణం. అయితే గాయం నుంచి కోలుకున్న తర్వా త బుమ్రాలో పదును తగ్గినట్లుందనే సందేహాన్ని మరోసారి ఈ మ్యాచ్ రేపింది. వన్డే సిరీస్ సమయంలోనే బుమ్రాను ఇకపై అందరూ సమర్థంగా ఎదుర్కోగలరంటూ కివీస్ బ్యాట్స్‌మెన్ చేసిన వ్యాఖ్యకు టెస్టు కూడా బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో జట్టు ఏదైనా మార్పులతో, కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతుందా చూడాలి.
భారమైన బ్యాటింగ్...
న్యూజిలాండ్‌లో ఉండే విభిన్న పరిస్థితుల కారణంగా టెస్టు మ్యాచ్‌లు ప్రతీసారి సవాల్ విసురుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. కఠిన పరిస్థితుల్లో సీమ్, స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో మనవాళ్లు పేలవమని మరోసారి తేలింది. కోహ్లి నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడుతూ అజేయ శక్తిగా ఎదిగిన తర్వాత ఇటీవలి కాలంలో ఇంతటి భారీ పరాజయం ఎప్పుడూ చవిచూడలేదు. పిచ్ ఎలా ఉన్నా... వరల్డ్ నంబర్‌వన్ టీమ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ 200 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.
పర్వతంపై కివీస్ విజయ వేడుకలు...
వెల్లింగ్టన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్ జట్టు సంబరాలు చేసుకోవడంలో ఒక పాత సాంప్రదాయాన్ని కొనసాగించింది. మ్యాచ్ జరిగిన బేసిన్ రిజర్వ్ మైదానం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ విక్టోరియాపైకి వెళ్లి తమ గెలుపును ఆస్వాదించారు. 1998లో భారత్‌పై బాక్సింగ్ డే టెస్టులో గెలిచిన నాటి నుంచి ఇది కొనసాగుతోంది. ఇందులో జట్టు బౌలర్లు, వికెట్ కీపర్ మాత్రమే పాల్గొంటారు. బ్యాట్స్‌మెన్‌కు చోటు లేదు. ఆటగాళ్లంతా పట్టే పడవలాంటి లిమోజిన్ కారులో నగరంలో అత్యంత ఖరీదైన షాంపేన్ సీసాలు, క్యూబన్ సిగార్స్ తీసుకొని అంతా పర్వతంపైకి చేరుకుంటారు. అక్కడి నుంచి నగరాన్ని, తాము ఆడిన మైదానాన్ని చూస్తూ గెలుపు వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏర్పాట్లన్నీ చేసే బాధ్యత వికెట్ కీపర్‌దే! 2009 నుంచి 2013 మధ్య వెల్లింగ్టన్‌లో కివీస్ ఒక్క టెస్టు కూడా గెలవకపోవడంతో ఆ నాలుగేళ్లు ఈ పర్వత సంబరాలు జరగలేదు.
టాస్ కీలకమా!
భారత్ ఓటమికి టాస్ ఓడిపోవడం కూడా కారణమని కోహ్లి చెప్పడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. కోచ్ రవిశాస్త్రి ఎప్పుడూ మాట్లాడినా... మాకు టాస్‌తో పని లేదు. అసలు టాస్‌ను లెక్కలోంచే తీసేస్తున్నాం. దాంతో సంబంధం లేకుండా గెలుస్తాం అని చెబుతూ వచ్చాడు. అయితే ఇదంతా స్వదేశంలోనే పనికొస్తుందని ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన కీలకం కాబట్టి టాస్ గెలిచి ఉంటే బాగుండేదని కోహ్లి అభిప్రాయం కావచ్చు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. 2009 తర్వాత సొంతగడ్డపై 17 టెస్టుల్లో టాస్‌లు గెలిచిన కివీస్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు!
Comments
Please login to add a commentAdd a comment