తుంబ తయారీకి కొలమానం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని యాత్రకు రథాల తయారీ పనులు ఊపందుకున్నాయి. అక్షయ తృతీయ నుంచి ఈ పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మూడో రోజు మంగళవారం నాటికి ఇరుసు ప్రాథమిక స్థాయి తుంబ పనులు తొలిదశ పూర్తయ్యింది. శ్రీమందిరం సింహద్వారం ఆవరణ బొడొదండొ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద ఈ పనులు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి వడ్రంగి సేవకులు పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మంగళవారం సమగ్రంగా 40 మంది వడ్రంగి సేవకులు పాల్గొన్నారు.
వీరిలో 17మంది మహరణ వర్గం, 12మంది భొయి వర్గం, 4 మంది కొరొతి (రంపపు కోత) వర్గం, ఆరు కమ్మరి కార్మికులు ఉన్నారు. సాయంత్రం చీకటి పడేంత వరకు శ్రమించి 3 రథాల కోసం మొత్తం మీద 9 తుంబల తయారు చేశారు. రథ చక్రం ఇరుసు యొక్క వృత్తాకార మధ్య భాగం తుంబగా వ్యవహరిస్తారు. 3 రథాల ప్రత్యేక విశ్వకర్మ ప్రముఖ వడ్రంగి సేవకుల పర్యవేక్షణలో వడ్రంగి పనులు చురుకుగా సాగుతున్నాయి.
యాత్ర కోసం తయారు అవుతున్న తాళ ధ్వజం, దేవ దళనం, నంది ఘోష్ 3 రథాల కోసం సమగ్రంగా 42 తుంబలను తయారు చేస్తారు. వీటిలో బలభద్ర స్వామి రథం తాళ ధ్వజానికి 14, దేవీ సుభద్ర రథం దేవ దళానికి 12 మరియు శ్రీ జగన్నాథుని నంది ఘోష్ రథానికి అత్యధికంగా 16 తుంబల్ని అమర్చుతారు. బలభద్రుడు, శ్రీ జగన్నాథుని రథాల తుంబల కొలమానం 2 అడుగుల 8 అంగుళాలు కాగా దేవీ సుభద్ర రథం తుంబ పరిమాణం 3 అడుగులు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment