అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మితో వాగ్వాదం చేస్తున్న ఒడిశా అధికారులు
మందస: ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన భూభాగంలో ఒడిశా అధికారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రైతుల జిరాయితీ భూముల్లో దౌర్జన్యాలు చేస్తున్న ఒడిశా అధికారులు మరో అడుగు ముందుకు వేసి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంస్థలను కూడా బెదిరిస్తున్నారు. పోలీసు కేసులు పెడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సాబకోట పంచాయతీలోని సరిహద్దు ప్రాంతానికి ఆనించి ఒడిశా భూభాగం ఉంది. ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలతో ఆంధ్రా గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఒడిశా అధికారులు, పోలీసులు గిరిజనులను బంధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒడిశా అధికారులతో పాటు పోలీసుల నుంచి వేధింపులకు గురవుతున్న గిరిజనులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు.
చదవండి: ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య
సాబకోట పంచాయతీ మాణిక్యపట్నంలో సుమారు 65 కుటుంబాలున్నాయి. వీరికి మినీ అంగన్‌వాడీ కేంద్రం ఉంది. భవనం లేకపోవడంతో 2012వ సంవత్సరంలో గిరిజనులు రేకులషెడ్‌ను ఆంధ్రా భూభాగంలో నిర్మించారు. ప్రస్తుతం మాణిక్యపట్నం మినీ అంగన్‌వాడీ భవనాన్ని తొలగించాలని ఒడిశా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒడిశా తహసీల్దార్ బుధవారం సిబ్బందితో వచ్చి అంగన్‌వాడీ కార్యకర్త సవర లక్ష్మిని బెదిరించి, పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె హుటాహుటిన సమస్యను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకువచ్చారు. ఒడిశా అధికారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. మంత్రి సీదిరి సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఒడిశా అధికారులు, పోలీసుల నుంచి తరచూ బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారులు స్పందించి రక్షించాలని సర్పంచ్ సవర సంధ్యారాము కోరారు.
చదవండి: ఒడిశా దుశ్చర్యపై రాజన్నదొర అసహనం
Comments
Please login to add a commentAdd a comment