వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో ప్రకాశ్ జవదేకర్, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు.
‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు.
శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు.
ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్‌షాపు తెలంగాణ ఇన్‌చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్‌ఎస్‌తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్‌షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్‌రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment