
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రను ఒడిశాలోని పూరీలో మినహా రాష్ట్రాంలోని మిగిలిన ప్రాంతాల్లో చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కరోనా విజృంభణతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో అనుమతులివ్వలేమని తెలిపింది. పూరీ మినహా ఇతరప్రాంతాల్లో రథయాత్రలను అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని హైకోర్టు సమర్ధించింది.
హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ‘నాకూ జగన్నాథ రథయాత్రను చూసేందుకు పూరీ వెళ్లాలనే ఉంది. కానీ మనమేమీ నిపుణులం కాము. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఛాన్సు తీసుకోలేము. కావాలంటే యాత్రను టీవీలో చూడొచ్చు. వచ్చే దఫా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాం’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఈనెల 12న పూరీ సహా పలు ప్రాంతాల్లో వార్షిక రథయాత్ర జరగాల్సి ఉంది.