మనన్‌ కాదు... మనం నెగ్గాం | sunrisers Hyderabad beat Kings XI Punjab | Sakshi
Sakshi News home page

మనన్‌ కాదు... మనం నెగ్గాం

Published Tue, Apr 18 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

మనన్‌ కాదు... మనం నెగ్గాం

మనన్‌ కాదు... మనం నెగ్గాం

సన్‌రైజర్స్‌ని గెలిపించిన భువనేశ్వర్‌
5 పరుగులతో ఓడిన పంజాబ్‌
మనన్‌ వోహ్రా విధ్వంసకర ప్రదర్శన వృథా
రాణించిన వార్నర్‌


విజయానికి 6 ఓవర్లలో పంజాబ్‌ చేయాల్సిన పరుగులు 76... ఈ దశలో హైదరాబాద్‌ గెలుపు దాదాపు ఖాయమైంది. కానీ క్రీజ్‌లో ఉన్న మనన్‌ వోహ్రా మరోలా ఆలోచించాడు. మెరుపు బ్యాటింగ్‌తో ఒక్కసారిగా సీన్‌ మార్చేశాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు రాబట్టాడు. చివర్లో 10 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో భువనేశ్వర్‌ అద్భుత బంతితో వోహ్రాను అవుట్‌ చేసి పంజాబ్‌ ఆశలను కూల్చాడు. భువీ బౌలింగ్‌తో ఊపిరి పీల్చుకున్న హైదరాబాద్‌ చివరకు ఐదు పరుగులతో గట్టెక్కింది.

హైదరాబాద్‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ మనన్‌ వోహ్రా (50 బంతుల్లో 95; 9 ఫోర్లు, 5 సిక్సర్లు)  చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆ జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. సహచరుల అండ లేకపోయినా అంతా తానే అయి జట్టును విజయానికి చేరువగా తెచ్చినా... వోహ్రా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 పరుగుల  తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్నర్‌ (54 బంతుల్లో 70 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత అర్ధసెంచరీ సాధించగా, నమన్‌ ఓజా (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం పంజాబ్‌ 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మనన్‌ మినహా అంతా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువనేశ్వర్‌ కుమార్‌ సన్‌రైజర్స్‌  విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రాణించిన ఓజా...
టాస్‌ గెలిచిన పంజాబ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ ఆడిన జట్టులో హైదరాబాద్‌ మూడు మార్పులు చేసింది. నెహ్రా, బిపుల్‌ స్థానంలో సిద్ధార్థ్‌ కౌల్, బరీందర్‌ శరణ్‌లను తీసుకోగా... కటింగ్‌ స్థానంలో అఫ్ఘానిస్తాన్‌ క్రికెటర్‌ నబీకి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. రైజర్స్‌ ఇన్నింగ్స్‌ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది. 14వ బంతికి గానీ జట్టు తొలి బౌండరీ సాధించలేకపోయింది. ఇబ్బందిగా ఆడిన శిఖర్‌ ధావన్‌ (15 బంతుల్లో 15; 1 ఫోర్‌)ను మోహిత్‌ అవుట్‌ చేసి పంజాబ్‌కు తొలి వికెట్‌ అందించగా... పవర్‌ప్లేలో హైదరాబాద్‌ స్కోరు 29 పరుగులు మాత్రమే. ఆ తర్వాత అక్షర్‌ తొలి ఓవర్లోనే సన్‌ను దెబ్బ తీశాడు. హెన్రిక్స్‌ (9) స్టంపౌంట్‌ కాగా, యువరాజ్‌ (0) ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో యువీకి ఇదే తొలి ‘గోల్డెన్‌ డక్‌’ కావడం విశేషం. ఈ దశలో వార్నర్‌కు ఓజా అండగా నిలిచాడు. గత సీజన్‌ నుంచి ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడకుండా విఫలమవుతూ వచ్చిన నమన్‌ ఎట్టకేలకు తన చోటు ప్రమాదంలో పడిన సమయంలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వార్నర్, ఓజా నాలుగో వికెట్‌కు 37 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. ఓజా అవుటయ్యాక హుడా (12), నబీ (2) విఫలమైనా మరో ఎండ్‌లో వార్నర్‌ పట్టుదలగా ఆడాడు.

వార్నర్‌ మరోసారి...
బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించని పిచ్‌పై వార్నర్‌ చక్కటి ఆటతో సన్‌ ఇన్నింగ్స్‌లో మరోసారి  కీలకపాత్ర పోషించాడు. తాను ఆడిన 18వ బంతికి గానీ తొలి బౌండరీ కొట్టలేకపోయిన అతను, నిలదొక్కుకున్న తర్వాత ధాటిగా ఆడాడు. కరియప్ప బౌలింగ్‌లో రివర్స్‌లో ర్యాంప్‌ షాట్‌ ఆడి కొట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో అతి నెమ్మదిగా 45 బంతుల్లో వార్నర్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్‌పై అతనికి ఇది వరుసగా ఐదో హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. మోహిత్‌ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, చివరి ఓవర్లో మోర్గాన్‌ క్యాచ్‌ వదిలేయడంతో మరో సిక్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో వార్నర్‌ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయడం ఇది రెండోసారి మాత్రమే.  

ఛేదనలో తొలి బంతికే భువనేశ్వర్, ఆమ్లా (0)ను అవుట్‌ చేసి పంజాబ్‌కు షాక్‌ ఇచ్చాడు. భువీ తన తర్వాతి ఓవర్లో ప్రధాన బ్యాట్స్‌మన్‌http://img.sakshi.net/images/cms/2017-04/41492455919_Unknown.jpgమ్యాక్స్‌వెల్‌ (10)ను కూడా అవుట్‌ చేసి రైజర్స్‌ జట్టులో ఉత్సాహం పెంచాడు. అయితే మరో ఎండ్‌లో వోహ్రా దూకుడు ప్రదర్శించాడు. రషీద్‌ తొలి ఓవర్లో అతను రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. వీరిద్దరు మూడో వికెట్‌కు 32 బంతుల్లో 41 పరుగులు జోడించిన దశలో అప్ఘాన్‌ ద్వయం కింగ్స్‌ను దెబ్బ తీసింది. ముందుగా మోర్గాన్‌ (13)ను నబీ బౌల్డ్‌ చేయగా...తర్వాతి ఓవర్లోనే మిల్లర్‌ (1), సాహా (0)ల స్టంప్స్‌ను రషీద్‌ పడగొట్టాడు. అక్షర్‌ (7) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కానీ చివర్లో వోహ్రా అదరగొట్టే బ్యాటింగ్‌ పంజాబ్‌ జట్టులో ఆశలు రేపినా... ఓటమి మాత్రం తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement