bharatpur
-
ఛాతీపై కొట్టి, లైంగికంగా వేధించి.. ఆర్మీ ఆఫీసర్‌కు కాబోయే భార్యపై పోలీసుల దాష్టీకం
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్‌చేసి కేసును సీఐడీకి అప్పగించింది. అసలేం జరిగింది? పశ్చిమ బెంగాల్లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు. ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్‌పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు. వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్‌ను లాకప్‌లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్‌లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్ ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్‌చేశారు. శనివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్‌స్టేషన్‌లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.పోలీసుల సస్పెన్షన్ ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్‌ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సు మీదకు దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. భరత్‌పూర్‌లోని హంత్రా సమీపంలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌కు బస్సు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున లఖన్‌పూర్ ప్రాంతంలోని అంత్రా ఫ్లైఓవర్ వద్ద బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. డీజిల్ అయిపోవడంతో డ్రైవర్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనకాల నిల్చొని ఉన్నారు. అదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు వెనకాల వేచి ఉన్న 11 మంది (అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 12 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అంతు, నంద్రం, లల్లు, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్‌గా గుర్తించారు. ఈ ఘనటలో అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదం జరిగింది. జీపును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. ఒకరికి గాయలయ్యాయి. చదవండి: పరీక్ష రాసి తిరిగివస్తూ.. ముగ్గురు బీటెక్ విద్యార్థుల దుర్మరణం -
Tourist Spot: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ విహారం.. ఖండాంతరాలు దాటి..
భరత్పూర్ బర్డ్ శాంక్చురీ... మన పక్షి ప్రేమికుడు సలీం అలీ మానసపుత్రిక. పక్షులు... ఖండాలు దాటి వస్తాయి. పర్యాటకులు... దేశాలు దాటి వస్తారు. పిల్లలు... ఏకంగా బడినే తెచ్చేస్తారు. worlds most important bird breeding: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ రాజస్థాన్‌లో ఉంది. ఈ ప్రదేశం దేశరాజధాని ఢిల్లీకి ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమదూరంలో ఉంది. ఆగ్రాలో తాజ్‌మహల్ చూసిన తర్వాత పశ్చిమంగా యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తే భరత్‌పూర్‌లో ఉంటాం. ఏటా ఇక్కడికి సైబీరియా పక్షులు వస్తాయి. ఇక్కడ ఉన్నవి, అతిథులుగా వచ్చినవి కలిపి మొత్తం 370 పక్షిజాతులను చూడవచ్చు. అందుకే ప్రపంచంలోని ఆర్నిథాలజిస్టులు భరత్‌పూర్‌కి క్యూ కడతారు. ఏడాదికి లక్ష మంది పర్యాటకులకు తగ్గరు, వారిలో యాభై వేల మంది విదేశీయులే. స్కూలు పిల్లలైతే ఆ పరిసరాల జిల్లాలే కాదు ఢిల్లీ నుంచి కూడా ఎక్స్కర్షన్కి భరత్‌పూర్‌కి వస్తారు. పిల్లలకు వంద పేజీల పుస్తకంతో కూడా చెప్పలేనన్ని సంగతులను ఒక్క టూర్‌తో చెప్పవచ్చు. అందుకే బడి అప్పుడప్పుడూ అడవిలోకి వచ్చేస్తుంటుంది. బర్డ్ సాంక్చురీలో ఏనుగు మీద విహారం ఏనుగు అంబారీ! భరత్పూర్ బర్డ్ శాంక్చురీలో ఎలిఫెంట్ సఫారీ, జీప్ సఫారీతోపాటు రిక్షా సఫారీ కూడా ఉంటుంది. పక్షులు శబ్దాలకు బెదిరి ఎగిరిపోకుండా ఉండాలంటే ఏనుగు మీద కానీ రిక్షాలో కానీ వెళ్లాలి. రిక్షావాలానే గైడ్‌గా వ్యవహరిస్తాడు. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్లడానికి మాత్రం జీప్ సఫారీనే మంచి ఆప్షన్. ఇక్కడ సఫారీ పగలు మాత్రమే. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. బర్డ్ శాంక్చురీ ప్రవేశ ద్వారం దగ్గరే జీప్ బుక్ చేసుకోవాలి. మితిమీరిన శబ్దాలను, హారన్లను అనుమతించరు. సొంత వాహనంలో వెళ్లినా సరే శాంక్చురీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ వాహనాన్ని వదిలి టూరిజం శాఖ వాహనాల్లోనే లోపలికి వెళ్లాలి. ఇక్కడ ఫొటోగ్రఫీ, వీడియో షూటింగ్‌ను అనుమతిస్తారు. కానీ ఎంట్రీ టికెట్‌తోపాటు కెమెరాలకు చార్జ్ చెల్లించాలి. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! వేటాడే అడవి కాదిప్పుడు ►ఇది ఒకప్పుడు భరత్పూర్ రాజుల వేటమైదానం. బ్రిటిష్ వైశ్రాయ్‌లు కూడా ఏటా ఇక్కడ డక్షూట్ నిర్వహించేవారు. ►ఒక ఏడాది వైశ్రా య్ లార్డ్ లినిత్గౌ వేటలో వేలాది పక్షులు వేట ఆనందానికి బలయ్యాయి. ►ప్రసిద్ధ పక్షి ప్రేమికుడు సలీం అలీ కృషితో నలభై ఏళ్ల కిందట ఈ ప్రదేశం పక్షి సంరక్షణ కేంద్రంగా మారింది. ►1985లో ఇది వర ల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ►అడవిలో నేల రాళ్ల మయం. నున్నటి కాలిబాట వంటి రోడ్డు కూడా ఉండ దు. రాళ్లబాటలోనే నడవాలి. కాబట్టి ఈ టూర్లో మంచి షూస్ ధరించాలి. ►ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, జైపూర్ టూర్ ప్లాన్‌లో భరత్పూర్ కూడా ఇమిడిపోతుంది. ఇదే మంచికాలం! ఖండాంతరాల నుంచి వచ్చే వలస పక్షులను చూడాలంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్లాలి. ఆహ్లాదకరంగా వెకేషన్ కోసమే అయితే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. గడ్డకట్టే చల్లని వాతావరణం నుంచి సమశీతోష్ణమైన వాతావరణాన్ని వెతుక్కుంటూ వచ్చే ఈ పక్షులకు ఆరు నెలల పాటు మంచి విడిది భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. ఏదైనా కారణం చేత ఒక ఏడాది నీటి నిల్వలు లేకపోయినట్లయితే ఈ పక్షులు నీళ్లున్న వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. ఒకసారి ఈ చక్రం గాడి తప్పితే మళ్లీ పక్షులు ఈ ప్రదేశానికి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ బర్డ్ శాంక్చురీ అసలు పేరు కేలాదేవ్ నేషనల్ పార్క్. ఈ పక్షి సంరక్షణ కేంద్రం భరత్‌పూర్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే భరత్‌ఫూర్ శాంక్చురీగా వాడుకలోకి వచ్చింది. ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు నేలకు దిగి పక్షుల రెక్కల్లో ఒదిగిపోయినట్లు్ల ఉంటుంది. రంగురంగుల పక్షులు నీటిలో మునిగి చేపలు పట్టుకుని కడుపు నిండిన తర్వాత ఒడ్డుకు చేరతాయి. తడిసిన రెక్కలను విప్పార్చి సన్‌బాత్ చేస్తున్న దృశ్యం ఈ టూర్లో కనువిందు చేసే మరో ప్రత్యేకత. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
రాజస్తాన్: భరత్‌పూర్‌లో డాక్టర్ దంపతుల దారుణ హత్య
-
అర్ధరాత్రి మహిళా ఎంపీ కారుపై రాళ్లు, రాడ్లతో దాడి
జైపూర్: కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న బీజేపీ లోక్‌సభ సభ్యురాలికి ఘోర పరాభవం ఎదురైంది. ఒక్కసారిగా కారును నిలువరించి రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోగా వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి రంజిత కోలి గెలిచారు. ఆమె తన నియోజకవర్గంలోని ఆస్పత్రుల సందర్శనకు మంగళవారం బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్పూర్ వెళ్తున్నారు. గ్రామం మీదుగా ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు.. ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. వీరి దాడితో ఎంపీ రంజిత, ఆమె అనుచరులు భయాందోళన చెందారు. వారి దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారు డిశ్చార్జయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విటర్లో పోస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అర్ధరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడి చేసిందని ఆరోపించారు. నేరాలకు రాజస్థాన్ అడ్డాగా మారిందని విమర్శించారు. చదవండి: సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన చదవండి: ఒక ప్రభుత్వం కాదు ఇది మూడు గ్రూపుల సర్కారు आज रात भरतपुर के आरबीएम हॉस्पिटल का निरीक्षण करने के बाद सीएचसी वैर का निरीक्षण करने जा रहीं भरतपुर सांसद श्रीमती रंजीता कोली जी के काफिले पर धरसोनी गांव के समीप हथियार बंद बदमाशों द्वारा हमला किया गया।@BJP4India @JPNadda @BJP4Rajasthan @DrSatishPoonia @chshekharbjp pic.twitter.com/CJkBECepDJ — Ranjeeta Koli MP (@RanjeetaKoliMP) May 27, 2021 -
ఓ నాన్న కథ!
-
కరోనాలోనే వింత: మహిళకు 31 సార్లు పాజిటివ్
జైపూర్: మహమ్మారి కరోనా ప్రపంచతోపాటు భారతదేశంలోనూ కల్లోలం రేపుతోంది. దీనికి సంబంధించిన విషయాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట. పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు పాజిటివ్ అనే వస్తోంది. దీన్ని చూసి వైద్యులే నివ్వెరపోయారు. లక్షణాలే లేకున్నా ఆమె పాజిటివ్ వస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఆమె నుంచి నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. అయినా కూడా ఆమెకు కేవలం ఐదు నెలల్లోనే 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెను భరత్పూర్ జిల్లాలోని ఆర్బీఎం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గతేడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యుడు భరద్వాజ్ తెలిపాడు. అలా ఇప్పటివరకు శారదకు 31 సార్లు కరోనా పరీక్షలు చేయగా.. ప్రతిసారి పాజిటివ్ వచ్చిందని వివరించారు. ప్రారంభంలో ఆమె అస్సలు నిల్చోడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. గతంలో ఆమె అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఆమె 7-8 కిలోల బరువు పెరగడం గమనార్హం. తొలిసారి వచ్చిన వైరస్ చికిత్స తీసుకున్నా శరీరంలో ఉంటుందని.. అందువల్లే ఆమెకు తరచూ పాజిటివ్ వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు. ఆమె కడుపు భాగంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండడంతో ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి నిర్ధారణ రాలేదు. ఆమె నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. -
ఇది న్యాయమేనా?!
న్యాయం అందించడంలో జాప్యం చోటుచేసుకుంటే అన్యాయం జరిగినట్టేనంటారు. అయినా మన దేశంలో అది దక్కడానికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది. కేసుల విచారణలో జాప్యం గురించి, పెరుగు తున్న పెండింగ్ కేసుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ క్రియకొచ్చేసరికి ఏమీ జరగదు. 35 ఏళ్లనాటి రాజస్తాన్ ఎన్కౌంటర్ గురించి రెండురోజులక్రితం వెలువడిన తీర్పు న్యాయం నత్తనడక గురించి అందరినీ మరోసారి మేల్కొలుపుతోంది. ఆ ఎన్కౌంటర్లో మరణించింది అనామకుడైన సాధారణ నేరగాడు కాదు. రాజ్యక్షేమానికి ప్రమాదకరంగా పరిణమించాడని నిందపడిన నక్సలైటు అసలే కాదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా డీగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించిన నాయకుడు రాజా మాన్సింగ్. స్వాతంత్య్రం వచ్చాక అప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయనే విజేత. 1985 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారస్థాయిలో వుండగా తన బ్యానర్లను, భరత్పూర్ జెండాను కాంగ్రెస్ కార్యకర్తలు చించేయడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి శివ్ చరణ్ మాధుర్ ఎక్కివచ్చిన హెలికాప్టర్ వున్నచోటికెళ్లి తన జీపుతో దాన్ని ఢీకొట్టి ధ్వంసం చేశారు. దానిపై కేసు నమోదైంది. ఆ మర్నాడు మద్దతుదార్లతో కలిసి లొంగిపోవడానికి పోలీస్‌స్టేషన్ వెళ్తుండగా మార్గమధ్యంలో నడిరోడ్డుపై పోలీసులు నేరుగా ఆయన్ను గురిపెట్టి కాల్చి చంపారు. మాన్సింగ్ పక్కనున్న ఆయన అనుచరులిద్దరు కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఇక అక్కడినుంచి ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే మన నేర న్యాయవ్యవస్థ తీరు తెన్నులు అర్థమవుతాయి. కాల్పులు జరిపిన డీఎస్పీ కాన్‌సింగ్ భాటికి ఇప్పుడు 82 ఏళ్లు. ఎస్ఐ వీరేంద్ర సింగ్‌కు 78 ఏళ్లు. ఇతర కానిస్టేబుళ్లు కూడా 70 ఏళ్లు పైబడినవారే. వీరందరికీ ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా జడ్జి యావజ్జీవ శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనంటారు. మాన్సింగ్ తప్పు చేసివుంటే ఆయనపై కేసు పెట్టి శిక్షించవచ్చు. కానీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నేరాలు, ఘోరాలు జరగని చోటు ప్రపంచంలో ఎక్కడా వుండదు. కానీ నిర్భీతిగా, నిష్పక్షపాతంగా, శరవేగంతో పనిచేసే న్యాయవ్యవస్థ వున్నచోట నేరాల సంఖ్య కనిష్టంగా వుంటుంది. తప్పు చేస్తే ఎంతటివారికైనా దండన తప్పదన్న స్పృహ వున్న చోట నేరగాళ్లలో భయం ఏర్పడుతుంది. అలాంటిచోట శాంతిభద్రతలు అదుపులో వుంటాయి. కానీ ఈ కేసు పరిణామక్రమం అందుకు విరుద్ధంగా సాగింది. మాన్సింగ్ కేసు నడిచిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది అసాధారణమైనది. ఆ ఎన్‌కౌంటర్‌కు నైతిక బాధ్యతవహించి అప్పటి ముఖ్యమంత్రి మాధుర్ రాజీనామా చేయాల్సివచ్చింది. వారం తర్వాత దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఇదంతా చూసి నిందితులకు వెనువెంటనే కఠినశిక్ష పడుతుందన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడివుంటుంది. అన్నిటికీ మించి ఎన్కౌంటర్లో మరణించిన ఎమ్మెల్యే భరత్పూర్ సంస్థాన వారసుడు. జాట్ కులంలో పేరుప్రఖ్యాతులున్నవాడు. జిల్లా రాజకీయాలను శాసిస్తున్నవాడు. అయినా ఇవేమీ పనికి రాలేదు. ఒక దశలో మాన్సింగ్ కుటుంబసభ్యులు తమకు ఇక్కడ న్యాయం దొరికేలా లేదని, కేసును రాష్ట్రం వెలుపలికి తరలించాలని కోరారు. వారి సూచన మేరకు అది ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోర్టుకు వెళ్లింది. అప్పటినుంచి మొత్తం 1,700 దఫాలకు పైగా విచారణ కొనసాగాక 35 ఏళ్ల తర్వాత దోష నిర్ధారణ జరిగింది. అయితే ఇప్పటికి తేలింది జిల్లా కోర్టులో మాత్రమే. ఈ కేసుపై ఇంకా అప్పీళ్లు వుంటాయి. కేసు హైకోర్టుకు వెళ్తే అక్కడ మరెన్నాళ్లు సాగుతుందో, ఎప్పుడు తీర్పు వస్తుందో చెప్పలేం. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వుంది. సాధారణంగా అల్లర్ల కేసుల్లో, నరమేథానికి సంబంధించిన కేసుల్లో నిందితుల దోష నిర్ధారణ కష్టమవుతుంది. ఫోరెన్సిక్ సాక్ష్యాల సంగతలావుంచి... నిందితుడు ఫలానా వ్యక్తిని చంపినప్పుడు, చంపమని ఎవరినైనా ప్రోత్సహించినప్పుడు తాను చూశానని చెబితే... నేరానికి పథక రచన చేయడంలో అతగాడి ప్రమేయం వున్నదని నిర్ధారణగా చెప్పగలిగితే తప్ప అటువంటి కేసుల్లో నిందితులు తప్పించుకోవడానికి ఛాన్సుంటుంది. కానీ భరత్పూర్ ఎన్ కౌంటర్ నడిరోడ్డుపై జరిగింది. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించామని చెప్పి, వాహనాలను ఆపేసి దూరం నుంచి అందరూ చూస్తుండగానే పోలీసులు కాల్చిచంపారు. మరణించిన నాయకుడు డబ్బు, పలుకుబడి వున్నవాడు. అయినా ఇవేవీ కేసు విచారణలో చోటుచేసుకునే జాప్యాన్ని నివారించలేక పోయాయి. మన న్యాయస్థానాల్లో పెండింగ్‌కేసుల సంఖ్య అపరిమితంగా వుంటోంది. కింది కోర్టుల్లో 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్లోవుంటే... హైకోర్టుల్లో 44 లక్షల కేసులు, సర్వోన్నత న్యాయస్థానంలో 60,000 కేసులు ఏళ్లతరబడి ఎటూ తేలకుండా వున్నాయి. సకాలంలో న్యాయం అందే తోవ లేనప్పుడు సాధారణ పౌరులకు న్యాయప్రక్రియ పట్ల, దాని సామర్థ్యం పట్ల విశ్వాసం సడలే ప్రమాదం లేదా? నేరగాళ్లకు అది వరంగా మారదా? పరిస్థితి ఇలా అఘోరించింది కనుకనే అత్యాచారం జరిగినప్పుడల్లా నిందితులను ఎన్కౌంటర్లో కాల్చిచంపాలన్న డిమాండు బయ ల్దేరుతోంది. ఇది పరిష్కరించాల్సిన సమస్యేనని అటు ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. ఇటు న్యాయవ్యవస్థ సైతం అంగీకరిస్తోంది. కానీ న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయడం, కోర్టుల సంఖ్యను పెంచడం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వగైరాల విషయంలో అవసరమైన చురుకుదనం లోపించింది. నిరర్ధకమైన కేసులు, మౌలిక సదుపాయాల లేమి దీనికి అదనం. అసలు కేసుల దర్యాప్తులోనే అడుగడుగునా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. వీటన్నిటినీ సరిచేస్తే తప్ప ప్రజానీకానికి సకాలంలో న్యాయం దక్కదు. ఆలస్య న్యాయం అన్యాయమేనని మన పాలకులు గుర్తిస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. -
చెరువులోకి దూసుకెళ్లిన జీపు, నలుగురు మృతి
జైపూర్ : జీపు చెరువులో పడి నలుగురు మృతిచెందిన సంఘటన రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదం తెల్లవారుజాము దాటిన తర్వాత జరిగింది. మధుర నుంచి అల్వార్‌కు తిరిగి వెళ్తుండగా డ్రైవర్ జీపుపై అదుపు కోల్పోవడంతో చెరువులోకి పడిపోయింది. ఈ సంఘటనలో ఇంద్ర జైన్(38), పవన్ జైన్(40), అతని భార్య మనీషా(38), వారి ఏడేళ్ల వయసున్న కుమార్తె ప్యారి చనిపోయారు. మరో ఐదుగురు గాయపడగా చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
ఫుడ్‌పాయిజన్.. 60 మంది ఆసుపత్రి పాలు
భరత్పూర్: ఓ వేడుకలో విందు భోజనం వికటించి 60 మంది ఆసుపత్రి పాలైన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లా సర్సైనా గ్రామంలో శుక్రవారం రాత్రి విందు భోజనం చేసినవారు వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. -
పెళ్లి వేడుకలో విషాదం: 26 మంది మృతి
-
పెళ్లి వేడుకలో విషాదం: 25 మంది మృతి
భరత్పూర్: రాజస్ధాన్‌లోని భరత్‌పూర్‌లో గురువారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన పందిట్లో మృత్యువు విలయతాడవం సృష్టించింది. పెళ్లి కోసం వచ్చిన బంధువులు భారీ వర్షం కురవడంతో దగ్గరలోని ఓ గోడ పక్కనే నిల్చున్నారు. అప్పటికే వర్షానికి బాగా తడిసిన గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో దాదాపు 25 మంది నలిగి ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది తీవ్ర గాయాలయపాలయ్యారు. ఘటనపై మాట్లాడిన పోలీసులు మృతుల్లో 11 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కూలిన గోడ దాదాపు 90 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు. గోడకు అనుకుని ఏర్పాటు చేసిన కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
లేటు వయసులో టెన్త్ పాసైన మేయర్
జైపూర్: లేటు వయసులో టెన్త్ పాసై చదువుకు వయసుతో పని లేదని నిరూపించారు రాజస్థాన్ లోని భరత్ పూర్ మేయర్ శివసింగ్. 52 ఏళ్ల మేయర్ పదవ తరగతిలో 44.83 శాతంతో ఆయన ఉత్తీర్ణత పొందారు. శివసింగ్ సైన్స్ సబ్జెక్టులో అత్యధికంగా 53 మార్కులను సాధించారు. ఇందుకోసం ఆయన ఒక ట్యూటర్ ను నియమించుకున్నారు. ఉదయమంతా విపరీతమైన పని ఉండడంతో రోజు రాత్రి రెండుగంటలు చదవడానికి సమయాన్ని కేటాయించేవాడినని ఆయన తెలిపారు. శివసింగ్ 1972 లోనే వ్యక్తిగత కారణాల వల్ల చదువుకు దూరమయ్యారు. రాజస్థాన్ లోని కొత్త నిబంధనల ప్రకారం ఇకపై మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే వ్యక్తి తప్పని సరిగా పదవ తరగతి పాసవ్వాలి. మళ్లీ పోటీ చేయడానికి కూడా తన సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని, ఇంతటితో చదువు ఆపనని ఉన్నత చదువులు చదువుతానని చెప్పారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని ఆయన సూచిస్తున్నారు. -
బెంగాల్ లో బాంబుల మోత:ముగ్గురి మృతి
ముర్షిదాబాద్: మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్ లో హింస చెలరేగింది. అయితే నిత్యం చోటుచేసుకునే తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంల సంఘర్షణలా కాకుండా ఈసారి ఒకే పార్టీకి చెందిన రెండు గ్రూపులు నాటు బాంబులు విసురుకున్నాయి. ముర్షిదాబాద్ జిల్లా భరత్ పూర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఒక వర్గం లక్ష్యంగా మరొక వర్గం విసిరిన నాటుబాంబులు పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో విపక్ష పార్టీ సీపీఎం సభ్యులతో తన్నులాటలకు దిగుతోన్న తృణమూల్ కాంగ్రెస్.. స్వపక్షంలో గ్రూపు తగాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పార్టీ ఆందోళనలో పడింది.