లేటు వయసులో టెన్త్ పాసైన మేయర్
జైపూర్: లేటు వయసులో టెన్త్ పాసై చదువుకు వయసుతో పని లేదని నిరూపించారు రాజస్థాన్ లోని భరత్ పూర్ మేయర్ శివసింగ్. 52 ఏళ్ల మేయర్ పదవ తరగతిలో 44.83 శాతంతో ఆయన ఉత్తీర్ణత పొందారు. శివసింగ్ సైన్స్ సబ్జెక్టులో అత్యధికంగా 53 మార్కులను సాధించారు. ఇందుకోసం ఆయన ఒక ట్యూటర్ ను నియమించుకున్నారు.
ఉదయమంతా విపరీతమైన పని ఉండడంతో రోజు రాత్రి రెండుగంటలు చదవడానికి సమయాన్ని కేటాయించేవాడినని ఆయన తెలిపారు. శివసింగ్ 1972 లోనే వ్యక్తిగత కారణాల వల్ల చదువుకు దూరమయ్యారు. రాజస్థాన్ లోని కొత్త నిబంధనల ప్రకారం ఇకపై మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే వ్యక్తి తప్పని సరిగా పదవ తరగతి పాసవ్వాలి. మళ్లీ పోటీ చేయడానికి కూడా తన సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని, ఇంతటితో చదువు ఆపనని ఉన్నత చదువులు చదువుతానని చెప్పారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని ఆయన సూచిస్తున్నారు.