భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో దాదాపు 200కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.
సాక్షి, విశాఖపట్నం: తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానంతోపాటు చెన్నై నుంచి విశాఖపట్నం వస్తున్న విమానానికి మంగళవారం బెదిరింపులు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో వెంటనే భద్రత సిబ్బంది రెండు విమానాల్లోనూ బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు.
కాగా సోమవారం కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా ముంబయికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విమానాశ్రయానికి ఆగంతకుడు ఫోన్ చేసి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని బెదిరించడంతో.. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆకాశంలో ఉన్న విమానాన్ని పైలెట్లు వెంటనే వెనక్కి మళ్లించి విశాఖలో ల్యాండ్ చేశారు.
120 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. బాంబు స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, బాంబు లేదని గుర్తించారు. అనంతరం నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ముంబయికి బయలుదేరింది.
Comments
Please login to add a commentAdd a comment