జాతి వ్యతిరేకులకు అడ్డాగా జేయూ: బీజేపీ
కోల్కతా: జాదవపూర్ యూనివర్సిటీ(జేయూ) జాతి వ్యతిరేకులకు అడ్డాగా మారిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మండిపడింది. 'సీపీఎంకి చెందిన విద్యార్థులు చట్టవిరుద్ధంగా సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. వారి భావజాలానికి వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి చర్యలకైనా వామపక్ష విద్యార్థులు తెగిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. దీన్ని మేము ఖండిస్తున్నాం' అని పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ గోష్ అన్నారు. జేయూ వైస్ ఛాన్స్‌లర్ కూడా వారికి అండగా ఉంటున్నారని ఆరోపించారు.
శుక్రవారం జేయూలో సినిమా షూటింగ్ వివాదం జరిగిన విషయం తెలిసిందే. జాదవపూర్ యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ మద్ధతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏబీవీపీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ మూవీ 'బుద్ధా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' వివాదాస్పదమైంది. జాదవపూర్ వర్సిటీలో శుక్రవారం రాత్రి ఈ డైరెక్టర్ కు నల్లజెండాలతో నిరసన తెలిపడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వామపక్ష వర్గానికి చెందినవారు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ మూవీ యూనిట్ కు మద్ధతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.