‘ఐకాన్ ఎస్‌డబ్ల్యూఎం-2014’ ఎవరికో!
రాష్ట్రంలో పది మున్సిపాలిటీలకు స్థానం
విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి, సాలూరు
ఈనెల 28 నుంచి 30 వరకూ రాజధానిలో ప్రదర్శన
బొబ్బిలి, న్యూస్‌లైన్: చెత్తపై సమరభేరి మోగించి ఆదర్శంగా నిలిచిన పురపాలక సంఘాలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. పురపాలక శాఖ ప్రకటించిన 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్(ఐకాన్‌ఎస్‌డబ్ల్యుఎం)-2014 కోసం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆయా పురపాలక సంఘాల్లో అమలవుతున్న ఇంటింటి చెత్త సేకరణ, చెత్తశుద్ధి, సద్వినియోగం వంటివాటిపై అడిగిన ప్రశ్నావళిలో సంతృప్తికరంగా సమాధానం చెప్పిన 10 పురపాలక సంఘాలను ఈ అవార్డుకు పరిశీలన నిమిత్తం ఎంపిక చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల అధికారులు గత శనివారం హైదరాబాద్‌లో మునిసిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి ముందు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
అధికారుల చొరవే కీలకం: కాలువల్లో చెత్తలు పేరుకుపోవడం, ప్లాస్టిక్, పాలిథీన్ వినియోగం ఇష్టారాజ్యంగా ఉండటం, పట్టణాల్లో శుభ్రత లేకపోవడం, పురపాలక సంఘాల్లో నిధుల కొరత వంటివి వెంటాడేవి. మునిసిపాలిటీల కమిషనర్లు, పాలకవర్గాలు ప్రత్యేక చొరవ తీసుకుని అనంతపురం జిల్లా తాడిపత్రి, విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. చెత్తలేని పురపాలక సంఘంగా నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కూడా ఆదర్శంగా నిలిచింది.
ఆదర్శ మునిసిపాలిటీగా బొబ్బిలి: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బొబ్బిలి పురపాలక సంఘంలో చెత్తశుద్ధి పార్కు ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్, వాటర్ ప్యాకెట్ల నిషేధం అమలును ప్రారంభించారు. అప్పటి కమిషనర్ కరుణాకరం ప్రసాద్, అప్పటి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ కృష్ణ రంగారావుల సహాయంతో విజయవంతంగా నడుపుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ మున్సిపాలిటీగా పేరు వచ్చింది. ఇక్కడ అమలవుతున్న ఇంటింటి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం పరిశీలనకు డిల్లీ నుంచి కూడా ప్రతినిధులు వచ్చి వెళ్లారు. సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంట్ పార్కు నిర్మాణం చేసి గోబర్ గ్యాస్ ఉత్పత్తి, వర్మీ కంపోస్టు, వ్యర్థ పదార్థాల అమ్మకం వంటివి నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడంతో బొబ్బిలి మునిసిపాలిటీయే రాష్ట్రంలో ముందంజలో ఉంది. పక్కనే ఉన్న సాలూరు మున్సిపాలిటీ కూడా దీనిని అమలు చేస్తూ ఇప్పుడు బొబ్బిలి సరసన చేరింది. ఈ కార్యక్రమాలను బాగా అమలు చేస్తున్న పురపాలక సంఘాల్లో ప్రస్తు తం అధికారులు, అనధికారులతో కూడిన థర్డ్ పార్టీ పరిశీలన చేస్తుంది. ఈనెల 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో సెమినార్‌లు జరగనున్నాయి. అక్కడ ఎంపికైన పురపాలక సంఘాలన్నీ వారు చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, నివేదికలను కమిటీకి అందించాల్సి ఉంటుంది.
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూన్సివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.
ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీఆర్ అగ్రికల్చరల్ యూనివర్సీటీ ప్రాంగణంలో ఈ ఎంపిక జరగనుంది. (నిరుడు కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.)
జనవరి 28 నుంచి 30 వరకూ జరిగే సెమినార్‌లో 814 మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు.
అవార్డు పరిశీలనకు రాష్ట్రం నుంచి ఎంపికైన మునిసిపాలిటీలు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, సాలూరులతో పాటు పలమనేరు, తెనాలి, సూర్యాపేట, తాండూరు, వరంగల్, కోదాడ, కర్నూలు, గుంతకల్లు.