కోల్‌కతా : జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో బీజేపీ మద్దతుదారులైన కొందరు మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని వర్సిటీ ప్రొఫెసర్ ఆరోపించారు. ఓ వర్గాన్ని కించపరుస్తూ జాదవ్‌పూర్ వర్సిటీ ప్రతిష్టను మసకబార్చేలా ఆ పార్టీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తనను గాయపరిచారని ఆమె వెల్లడించారు. కాగా వర్సిటీ ప్రొఫెసర్‌పై తమ పార్టీ కార్యకర్తలెవరూ దాడిచేయలేదని, క్యాంపస్ వద్ద జరిగిన తమ పార్టీ సమావేశంలో లెఫ్ట్ మద్దతుదారులు ఆందోళన చేపట్టినా సంయమనం పాటించామని బీజేపీ నాయకత్వం పేర్కొంది. మరోవైపు తనపై జరిగిన దాడిని ఆంగ్ల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దొయితా మజుందార్ సోషల్ మీడియాలో వివరించారు.
పౌర చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని తాను వెనుదిరిగి వస్తుండగా క్యాంపస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరుగుతోందని, ఆ పార్టీ నేతలు విద్వేషపూరిత ప్రసంగం చేస్తున్నారని తెలిపారు. అన్ని అనర్ధాలకు ఈ యూనివర్సిటీ కారణమని, ఇక్కడ ప్రతిరోజూ వారంతా అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తుంటారని ఓ వక్త చెబుతుండగా తాను అవి అసత్యాలని బిగ్గరగా అరిచానని ఆమె చెప్పుకొచ్చారు. తాను ప్రతిఘటించిన వెంటనే తనను పలువురు బీజేపీ మహిళా కార్యకర్తలు చుట్టుముట్టి దారుణంగా కొట్టారని చెప్పారు. అడ్డగించిన మరో వ్యక్తిని కూడా వారు గాయపరిచారని అన్నారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రొఫెసర్ వెల్లడించారు. కాగా క్యాంపస్ వెలుపల తాము నిర్వహించిన సమావేశానికి కొందరు లెఫ్ట్ మద్దతుదారులు హాజరై నినాదాలు చేశారని, తమ కార్యకర్తలపై దాడి చేసినా తాము సంయమనం వహించామని బీజేపీ నేత షమిక్ భట్టాచార్య తెలిపారు. కాగా ప్రొఫెసర్ ఫిర్యాదుపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment