జేయూలో అఫ్జల్ పోస్టర్ల సంచలనం
కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ రాతలు
♦ జాదవ్‌పూర్ వర్సిటీలో సంచలనం
♦ ఘటనతో తమకు సంబంధం లేదన్న విద్యార్థి సంఘాలు
కోల్‌కతా: మంగళవారం అఫ్జల్‌కు అనుకూలంగా నినాదాలు.. బుధవారం కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లకు స్వాతంత్య్రం కావాలంటూ పోస్టర్లు. ఇదీ పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్ వర్సిటీలో తాజా పరిస్థితి. జేఎన్‌యూలో అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేయాలంటూ.. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిలీలో మొదలైన ఆందోళన.. పోస్టర్ల దాకా వెళ్లింది. ‘కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లకు స్వాతంత్య్రం కావాలి.’ అంటూ ‘రాడికల్’ గ్రూపు పేరుతో పోస్టర్లు వెలిశాయి. ‘దీనిపై విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమయ్యాను.
వారంతా పోస్టర్ల వివాదానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు’ అని వర్సిటీ వీసీ సృజన్ దాస్ తెలిపారు. తాజా పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేయటం లేదన్నారు. మరోవైపు మంగళవారం అఫ్జల్ అనుకూల నినాదాలతో జరిగిన ర్యాలీకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. కాగా, అఫ్జల్ అనుకూల నినాదాల ర్యాలీతో తమకేం సంబంధం లేదని ఎస్‌ఎఫ్‌ఐ తెలిపింది. ‘ఎవరో ఒక వర్గం చేసిన పనికి మొత్తం జేయూ విద్యార్థులపై విమర్శలు సరికాదు. ’ అని ఓ పక్రటనలో ఎస్‌ఎఫ్‌ఐ తెలిపింది. అయితే.. ఫిబ్రవరి 15న జేఎన్‌యూ విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ.. ఎస్‌ఎఫ్‌ఐతోపాటు వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఫిబ్రవరి 16వ తేదీన కొందరు విద్యార్థులు ఆరెస్సెస్, మోదీ వ్యతిరేక నినాదాలతో అఫ్జల్ ఉరిని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, పోస్టర్ల విడుదలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.