
పుత్తూరు: తన భర్తను కొట్టి చంపేశారని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షంచాలంటూ భార్య ఆక్రందనలతో పుత్తూరు ఆసుపత్రిలో మిన్నంటాయి. పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన మణికంఠ(29) రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించిన ఓ మహిళ అరుస్తూ వెళ్లి గ్రామస్తులకు తెలిపింది. వెంటనే గ్రామస్తులు 108కు సమాచారం అందించి పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పుడే పుత్తూరులో బస్సు దిగిన మృతుడి భార్యకు విషయం తెలియడంతో ఆసుపత్రిలో భర్త మృతదేహాన్ని చూసిన ఆమె బోరున విలపించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు... చినరాజుకుప్పం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుమారుడు మణికంఠ (29)కు తమిళనాడుకు చెందిన వీకేఆర్‌పురం గ్రామానికి చెందిన జననితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 5 ఏళ్ల కుమారుడు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో జనని శుక్రవారం కుమారుడ్ని చూడడానికి పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పుత్తూరులో బస్సు దిగి గ్రామానికి వెళ్లాల్సి ఉండగా గ్రామస్తులు కనబడి నీ భర్త చనిపోయాడని, పుత్తూరు ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఎందుకు ఎలా అంటూ ఆరా తీయగా మణికంఠ అతడి చిన్నాన్న వెంకటేశులు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తెలిపారని చెప్పారు. ఎవరు, ఎందుకు, ఎలా చంపేశారో తెలియదని, దీనిని పోలీసులే తేలి్చ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలు జనని ఆక్రోశించింది. మణికంఠ తిరుపతిలోని మహర్షి అభ్యుదయ సేవా సమితిలో పని చేస్తుండగా జనని ప్రస్తుతం గర్భిణి. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment