
బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన బాలిక
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు
బాధ్యులను శిక్షించాలంటున్న గ్రామస్తులు
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. బండపని చేసుకుంటూ పొట్టపోసుకునే బడుగులు.. ఏ పూటకు ఆ పూట కూలి తెచ్చుకుని జీవనం సాగించే నిరుపేదలు.. అష్టకష్టాలు పడుతున్నా తమ నలుగురు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అందులో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేశారు. మరో అమ్మాయిని పదోతరగతి, అబ్బాయిని ఏడోతరగతి, మూడో కుమార్తెను రెండో తరగతి చదివిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ సాఫీగానే సంసారం నెట్టుకొస్తున్నారు. ఇంతలో ఆ పేద కుటుంబంపై పిడుగు పడింది. వారి జీవితాలను అల్లకల్లోలం చేసేసింది.
పలమనేరు : మండలంలోని టి. వడ్డూరు గ్రామంలో బండపని చేసుకుని బతికే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. మిగిలినవారు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో రెండో బిడ్డకు కడుపు ముందుకొస్తోందని టీచర్లు చెప్పడంతో ఆందోళన చెందారు. కామెర్ల వల్ల అలా జరిగిందేమో అని పట్టించుకోలేదు. తర్వాత బాలికకు కడుపునొప్పి అసలు విషయం తెలిసింది. ఆ బిడ్డ గర్భం దాల్చిందని తెలిసి బంగారుపాళెంలోని సోదరి ఇంటికి పంపేశారు. అక్కడే ఓ ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. అయితే ఆ అమ్మాయికి ఫిట్స్ రావడంతో మూడురోజుల క్రితం చిత్తూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిజరేయన్ చేసి శిశువును బయటకి తీశారు. ఉన్నట్టుండి తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్సపొందుతూ ఆ బాలిక మృతిచెందింది. ఆ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
కారణం ఆ ముగ్గురే..
తన అక్క మృతికి ముగ్గురు యువకులు కారణమని చెల్లెలు వెల్లడించింది. తమ బంధువైన ఓ మహిళ కారణంగా తమ ఇంటికి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు వచ్చేవారని తెలిపింది. తరచూ బిరియానీ, ఇతర తినబండారాలను అక్కకు ఇచ్చేవారని వివరించింది.
గ్రామంలో నిరసనలు
ఇలా ఉండగా తిరుపతి నుంచి బాలిక మృతదేహం ఆంబులెన్స్‌లో రాగానే గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిక మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పలమనేరు సీఐ నరసింహరాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కఠినంగా శిక్షించాలి
మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భం దాల్చేలా చేసి, ఆమె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. తొమ్మిదినెలలు తన కడుపులో బిడ్డను మోస్తున్నా ఏ డాక్టరైనా ఎందుకు గుర్తించలేదు. ఇది వైద్యులు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. గతంలోనూ ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో నిందితులను కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగేవి కావు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి.
– భువనేశ్వరి, ఐద్వా జిల్లా కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment