విద్యార్థుల మధ్య చిక్కుకున్న మంత్రి సుప్రియో
కోల్‌కతా: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుప్రియోను ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు ఘెరావ్ చేశాయి. దీంతో ఆయన్ను కాపాడేందుకు సాక్షాత్తూ గవర్నర్ ధనకర్‌తో పాటు భారీగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన సుప్రియో రాకను నిరసిస్తూ భారీసంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగివెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్ దేబ్‌నాథ్ విమర్శించారు. ఈ ఉద్రిక్తత గురించి తెలుసుకున్న గవర్నర్ ధనకర్ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment