
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగిన అసన్‌సోల్–రాణిగంజ్ ప్రాంతాన్ని సందర్శించడానికి యత్నించిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను పోలీసులు గురువారం అడ్డుకున్నారు. సెక్షన్ 144 విధించిన ప్రాంతంలోకి ప్రవేశించడానికి యత్నించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కల్గించడంతో ఆయనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. ఐపీఎస్ అధికారిపై ఆయన దాడి చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి యత్నించిన బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ లాకెట్ ఛటర్జీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పోలీసులపై తాను ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్లు సుప్రియో మీడియాకు వెల్లడించారు. తనను ఎన్నుకున్న ప్రజల్ని కలుసుకోకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అసన్‌సోల్–రాణిగంజ్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశామన్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.