కోల్‌కతా : కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తనను దూషించారంటారని అసన్‌సోల్ మేయర్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జితేంద్ర కుమార్ ఆరోపించారు. అసభ్యంగా తిట్టడంతో పాటు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు..‘ అసన్‌సోల్ ఎంపీ, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కార్యాలయం నుంచి ఓ వ్యక్తి నాతో మాట్లాడాడు. అసభ్య పదజాలంతో నన్ను దూషించాడు. దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు’ అని లేఖలో పేర్కొన్నారు.
కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార తృణమూల్, బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో పార్టీ కార్యాలయాలు సైతం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ వర్ధమాన్ జిల్లాలోని టీఎంసీ కార్యాలయాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో.. అక్కడికి చేరుకున్న జితేంద్ర కుమార్ బీజేపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించకపోతే బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తానని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబుల్ సుప్రియో తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అసన్‌సోల్ సిట్టింగ్ ఎంపీగా ఎన్నికల బరిలో దిగిన బాబుల్ సుప్రియో ప్రత్యర్థి మున్‌మున్ సేన్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండోసారి నరేంద్ర మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆయన.. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment