
హనుమ విహారి
సిడ్నీ టెస్టులో జట్టును రక్షించేందుకు చివరి రోజున హనుమ విహారి చూపించిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ అతను 161 బంతులు ఆడాడు. దీనిపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం ఒక వ్యతిరేక వ్యాఖ్యతో తన అసంతృప్తిని ప్రదర్శించాడు.
‘7 పరుగులు చేసేందుకు 109 బంతులా... ఇంత ఘోర ప్రదర్శనతో క్రికెట్‌ను చంపేసి భారత జట్టు చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని హనుమ బిహారి పోగొట్టాడు. ఇది పెద్ద నేరం’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపైనే ట్విట్టర్‌లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సుప్రియో అజ్ఞానాన్ని అంత తిట్టిపోశారు. అయితే విహారి దీనికి ఒకే ఒక పదంతో సమాధానం ఇచ్చాడు. ఇది బుధవారం సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది.
తన పేరును తప్పుగా రాయడాన్ని చూపిస్తూ ‘హనుమ విహారి’ అంటూ భారత క్రికెటర్ ట్వీట్ చేశాడు. దీనికి సుమారు 61 వేల లైక్‌లు రాగా... సహచరుడు అశ్విన్ కూడా ROFL MAXX!! అంటూ పడిపడి దొర్లి నవ్వుతున్నట్లు ట్వీట్ చేశాడు. దీనికి 80 వేల లైక్‌లు వచ్చాయి. సెహా్వగ్ కూడా ‘ఒక్క విహారి అందరి లెక్క సరి చేశాడు’ అంటూ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment