
ఆ గూండాలు మా ఇంటిపై దాడి చేశారు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో బుధవారం ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసి.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కోల్‌కతాలోని తన నివాసంపై టీఎంసీ గూండాలు దాడి చేశారని, తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై ఇలా దాడికి దిగడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. కోల్‌కతా కైలాశ్ బోస్ ప్రాంతంలోని తన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీఎంసీ మద్దతుదారుల వీడియోను ఆయన ట్వీట్ చేశారు. రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ స్కాంలో ఇద్దరు టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఇది రాజకీయ కక్షసాధింపేనంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన దిగిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ-టీఎంసీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
'విషాదం ఏమిటంటే నేను కేంద్రమంత్రిని. నాకు ఎక్కడైనా పూర్తి భద్రత లభిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నిరుపేద బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల పరిస్థితి దారుణంగా ఉంది. వారిని చితకబాదుతున్నారు. బీజేపీ జెండాలను కాల్చేస్తున్నారు. ఓ వృద్ధురాలి ఇంటిపై బాంబు వేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బెంగాల్ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది' అని సుప్రియో అన్నారు.
TMC Goons trying 2 break into my Apartment in Kailash Bose Street where my MumDad are staying• How shameful is this