దయచేసి ఆ పార్టీలో చేరకండి: సీఎం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎంత ప్రలోభపెట్టినా బీజేపీలో మాత్రం చేరవద్దంటూ ఆమె ప్రజలకు విన్నవించారు. బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతుందని, గొడవలు సృష్టిస్తుందని, ప్రజలు ఒకర్నొకరు కొట్టుకునేలా చేస్తుందని, హింస రాజేస్తుందని మమత హెచ్చరించారు.
'ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బీజేపీలో చేరకండి. బీజేపీ హిందూ మతాన్ని అగౌరవ పరుస్తోంది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బోధనలను బెంగాల్ ప్రజలు విశ్వసిస్తారు. వారు మతసహనాన్ని బోధించారు. బీజేపీ ప్రచారం చేసే హిందూ భావజాలాన్ని మనం అంగీకరించరాదు. వాళ్లు హిందువులు కాదు. హిందూయిజం పేరుతో మతాన్ని అగౌరవపరుస్తున్నారు. మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణ పెడుతున్నారు' అని మమత అన్నారు.