
రెండు వారాల్లో పరిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ:నగరంలో విద్యుత్ సంక్షోభానికి కారణం గత పన్నెండేళ్లుగా ఢిల్లీ సర్కారు చేతులు ముడుచుకుని కూర్చోవడమేనని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు రెండు వారాలు పడుతుం ద ని ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమస్యపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో పాటు తమ శాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యుత్ శాఖ కార్యదర్శి, డిస్కంలతో సమావేశమై పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించినట్లు చెప్పారు. ఈ సంక్షోభానికి కారణం గత పన్నెండేళ్లుగా విద్యుత్ రంగానికి సంబంధించి సమగ్ర ప్రణాళిక , ముందుచూపు లోపించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 2002 నుంచి విద్యుత్ రంగంలో విధాన నిర్ణయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు కొరవడ్డాయని, ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.
ముందుచూపు లేకనే
పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తగు ప్రణాళికలు రూపొందించలేద న్నారు. గత పన్నెండేళ్లలో పవర్‌గ్రిడ్ సామర్థ్యం పెంచలేదని, అక్కడక్కడా ఓ ట్రాన్స్‌ఫార్మర్ వేయడమే తప్ప భవిష్యత్త్తు అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. గత పన్నెండేళ్ల కాలంలో విద్యుత్ ఉత్పాదన 400 మెగావాట్ల మేర మాత్రమే పెరిగిందని ఆయన చెప్పారు. గడచిన 12 ఏళ్లలో 14 మంది, మూడేళ్లలో ఐదుగురు విద్యుత్ శాఖ కార్యదర్శులు మారారన్నారు. సమస్య తీవ్రతపై ప్రభుత్వ స్పందన అంతంతేననడానికి ఇదొక మచ్చుక మాత్రమేనని అన్నారు.
ఢిల్లీ నగరంలో ఏడు ప్రధాన సబ్‌స్టేషన్లను, ఏడు ప్రధాన లైన్లను తక్షనమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, అయితే గత ప్రభుత్వం దానిని పట్టించుకోలేదన్నారు. సరిపడా విద్యుత్ ఉన్నప్పటికీ దాని సరఫరాకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్ లైన్లు లేవన్నారు. ఇటీవలి గాలిదుమారంతోపాటు ఉష్ణోగ్రతల పెరుగుదల ఈ సమస్యను మరింత జటిలం చేసిందన్నారు. గాలిదుమారం కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మండోలా- గోపాల్‌పూర్, బామ్నౌలీ- పప్పన్ కలాన్ లైన్లను ఇప్పటికే పునరుద్ధరించారన్నారు. సాధారణంగా మరమ్మతు పనులకు నెలల సమయం పడుతుందని, అయితే శరవేగంగా పూర్తి చేస్తున్నందుకుగాను సంబంధిత అధికారులను ఆయన అభినందించారు.
బవానా ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా
బవానా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఉత్పాదన సామర్థ్యం మంగళవారం రాత్రి నుంచి పెరుగుతుందని, ఇందుకు కావాల్సిన గ్యాస్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ కేవలం 290 మెగావాట్లు విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తోందని ఆయన చెప్పారు. విద్యుత్ ఉత్పాదన పెంపునకు గ్యాస్ అవసరమంటూ అధికారులు చెప్పారని, అందుకు ఎన్‌టీపీసీతోపాటు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖతోనూ మాట్లాడానని ఆయన చెప్పారు. అయితే తాను సమస్యను రాజకీయం చేయాలనుకోవడం లేదని అంటూనే ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తూర్పు ఢిల్లీ ఎంపీ... తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అక్కడ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. బదర్‌పూర్-నోయిడా-గాజీపూర్ లైను శుక్రవారం దెబ్బతిందని, భూగర్భ మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు.
అందుకు కావలసిన ఆరు జాయింట్లు ప్రస్తుతం అందుబాటులో లే వని అధికారులు చెప్పారని, వాటిని దేశంలో ఎక్కడినుంచైనా గానీ లేదా విదేశాల నుంచైనా గానీ తెప్పించి వేయాల్సిందిగా ఆదేశించానని గోయల్ చెప్పారు. మహారాణి బాగ్-గాజీపూర్ లైన్‌లో మూడు టవర్లను పునరుద్ధరించాల్సి ఉందని, వాటి పునరుద్ధరణ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పనికాకపోయినప్పటికీ ఆ పని దానికి అప్పగించి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. బవానా- నరేలా లైన్ మరమ్మతు పనులను కూడా ప్రాధాన్యతాపరంగా చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. దాద్రీ -లోనీ- హర్ష్‌విహార్ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ క్లియరెన్స్ కావాలని అధికారులు చెప్పారని, ఈ విషయమై మీరట్ కమిషనర్‌తో మాట్లాడాల్సిందిగా అధికారులను అదేశించానని చెప్పారు.
మండోలీలో మొబైల్ టవర్
మండోలీలో మొబైల్ టవర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. దక్షిణ ఢిల్లీలో మస్జీద్ మోడ్ వద్ద 100 మెగావాట్లు గ్రిడ్ పనులు జరుగుతున్నాయని, ఈ పనులు మంగళవారం రాత్రి వరకు పూర్తవుతాయని ఆయన చెప్పారు. విద్యుత్ ఫిర్యాదులకు సానుకూలంగా ప్రతిస్పందించాల్సిందిగా డిస్కంలను, 24 గంటలు ల్యాండ్ లైన్ ఫోన్లు, మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఎప్పుడు ఎక్కడ విద్యుత్ కోతలు విధిస్తారనే షెడ్యూల్‌ను ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటలకు బులెటిన్ విడుదల చేయాలని డిస్కంలను ఆదేశించినట్లు చెప్పారు. తాను ఆదేశించిన పనుల ప్రగతిపై ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సాయంత్రం ఐదు గంటలకు పురోగతి నివేదిక విడుదల చేస్తుందని ఆయన వివరించారు.