సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు, ప్రాజెక్టుల అమలుతీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం సమీక్షించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శి, వివిధ విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులతో రాజ్‌నివాస్‌లో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్, నీటి సరఫరా రంగాల్లోనగరంలో కొనసాగించాల్సిన సంస్కరణలు తొలుత చర్చకు వచ్చాయి. విద్యుత్ రంగంలో సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వాటిని ఆరు నెలల కాలంలో పూర్తిచేసేలా చూడాలంటూ ఈ సందర్భంగా ఎల్జీ... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. జలవనరుల వద్ద మంత్రిత్వశాఖ వద్ద పెండింగులో ఉన్న నీటి సరఫరా సంస్కరణలను శరవేగంగా చేపట్టడం కోసం నోడల్ అధికారిని నియమించాలని ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)తోపాటు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
లోక్‌నాయక్, గురుతేజ్ బహదూర్ ఆస్పత్రులను ఆదర్శ ఆసుపత్రులుగా తీర్చిదిద్దే అంశంపై కూడా చర్చ జరిగింది. లోక్‌నాయక్ ఆస్పత్రి భవనంలో పనులు మొదలయ్యాయని, సర్జికల్ బ్లాక్‌ను అభివృ ద్ధి చేసే పని కొనసాగుతుందని ఎల్జీకి...ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలియజేశారు. రోహిణీలో 100 సీట్ల వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, 2105 నాటికి పూర్తవుతాయని తెలిపారు. వైద్య పరికరాలు 2015 నాటికి అందుతాయని చెప్పారు. ప్రాణ రక్షక పరికరాలతో కూడిన 110 అంబులెన్సులు వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. కాగా అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్ ఫర్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ అండ్ రీహాబిలిటేషన్‌ను సంజయ్ గాంధీ ఆస్పత్రిలోప్రారంభించారు. నగరంలో మరో ఏడు సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30 డయాలిసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు.
అవి పనిచేయడం ప్రారంభించాయి. ఇటువంటి మరో 20 యూనిట్లను డా,. హెగ్డేవార్ ఆసుపత్రిలో రానున్న మూడు నెలల్లో ప్రయివేటు ప్రభుత్వ భాగస్వామ్యంతోఏర్పాటుచేస్తారు. బడ్జెట్లో ప్రకటించినవిధంగా దక్షిణ ఢిల్లీలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి చత్తర్ పూర్‌లో స్థలాన్ని గుర్తించారు. రోహిణి, షేక్‌సరాయ్ సాయుర్‌పుర్ గ్రామాల్లో ఫోరెన్సిక్ లేబోరేటరీలను ఏర్పాటు పనులు మొదలయ్యాయి. 155 మంది మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు, 1434 మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. ఈ నెలాఖరు నుంచి వారికి శిక్షణ ఇస్తారు. 14 పాఠశాలకు భవన నిర్మాణానికి అనుమతించారు. ఇందులో 10 భవనాల నిర్మాణపనులు మొదలయ్యాయి. బసంత్‌గావ్, తుగ్లకాబాద్‌లలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు కోసం స్థలం సేకరించారు. మరో నాలుగు వసతి గృహాలనుకూడా ఏర్పాటుచేస్తారు. 53 జేజే క్లస్టర్లలో 67 మొబైల్ టాయిలెట్ వ్యాన్లను ఏర్పాటుచేశారు. 1,380 లోఫ్లోర్ బస్సులు, ఆటోమేటిక్ టికెటింగ్‌యంత్రాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు జారీ చేశారు.
పథకాల అమలు తీరుపై ఎల్జీ సమీక్ష
Published Tue, Oct 14 2014 10:17 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement