
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు 20కి పైగా పరువు నష్టం దావా కేసులను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఏఏపీ నేతలు ఎదుర్కొంటున్న పరువు నష్టం దావా కేసులపై పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ జాతీయ మీడియాతో గురువారం మాట్లాడారు. పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు.
గతేడాది పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ ట్రేడ్‌లో బిక్రమ్‌కు కూడా భాగస్వామ్యం ఉందని కేజ్రీ ఆరోపించారు. కానీ, ఆ ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నిజానిజాలను రూఢీ చేసుకోకుండా మాట్లాడినందుకు కేజ్రీ, బిక్రమ్‌ను కోర్టు ముఖంగా క్షమాపణ కోరారని వెల్లడించారు.
అంతేకాకుండా త్వరలోనే కేజ్రీవాల్ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కూడా క్షమాపణ కోరతారని తెలిసింది. ఢిల్లీ క్రికెట్ పరిపాలనా సంఘానికి 13 ఏళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగిన సమయంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఏపీ నేతలు అందరూ అధినేత బాటలోనే పయనిస్తూ పరువు నష్టం కేసుల్లో ప్రత్యర్థులకు క్షమాపణలు చెబుతారనే వార్తలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment