సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధాని నగరంలో ‘స్వచ్ఛ్ భారత్’ పథకం గురువారమే ప్రారంభం కానుంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల రెండో తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా వచ్చే నెల 23 వరకు జరగనుంది. కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఇప్పటికే అన్ని భాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిగతా ప్రాంతాలకంటే ఢిల్లీ వెనుకబడకుండా చూడడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇందులోభాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన మొట్టమొదటిసారిగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం అమలు కోసం వ్యూహాన్ని రూపొందిం చాలంటూ ఆయన వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన మరో సమావేశంలో అన్ని అంశాలను సమీక్షించిన అనంతరం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), రవాణా, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, పర్యటన. పట్టణ అభివృద్ధి శాఖ తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. బడి పిల్లలు, యువతతోపాటు నగర వాసులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
పభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యూఏ), వర్తక సంఘాలు, మార్కెట్ అసోసియేషన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ఈ కార్యక్రమాన్ని వార్డు స్థాయిలో చేపట్టనుంది. దీని కింద పార్కులు, చెరువులు, వీధులు, రహదారులు, సర్వీస్ లేన్లు, ఖాళీ స్థలాల పరిశుభ్రతపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవం తం చేయడం కోసం తాము చేపట్టనున్న చర్యలను మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు... ఎల్జీకి ఇప్పటికే వివరించారు. ఖాళీగాఉన్న వెయ్యికిపైగా ప్లాట ్లను శుభ్రపరచడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా ఢిల్లీ అభివృద్ధి సంస్థను ఎల్జీ ఆదేశించారు.
కాగా పారిశ్రామికవాడల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో పేరుకుపోయిన దాదాపు 600 ట్రక్కులపైగా వ్యర్థాలను తొలగించనున్నారు. సామాస్య ప్రజలు కూడా తమ ఇళ్లు. దుకాణాల పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఎల్జీ కోరారు. రహదారులపై నిర్మాణ సామగ్రి, వ్యర్థాలను పారవేసే వారిపై ఈ కార్యక్రమంలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటారు. రహదారులు, పేవ్‌మెంట్లపై నిబంధనలకు భిన్నంగా నిలిపిఉంచిన వాహనాల యజమానులపై భారీఎత్తున జరిమానాలు విధిస్తారు. మరుగుదొడ్ల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మిస్తారు.
జరిమానాల కింద రూ. 28 లక్షలు వసూలు
న్యూఢిల్లీ: పారిశుధ్యాన్ని గాలికొదిలేసిన సంస్థలపై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరే షన్ (ఎస్‌డీఎంసీ) కొరడా ఝళిపించింది. ఈ నెలలో ఇప్పటివరకూ నాలుగు వేలమందికి చలాన్లు పంపిన కార్పొరేషన్ వారి వద్దనుంచి రూ. 28 లక్షలను జరిమానా కింద వసూలు చేసింది. ఇలా జరిమానా చెల్లించినవాటిలో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ), ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ)తోపాటు ఇంకా ప్రయివేటు సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మహేశ్ గుప్తా వెల్లడించారు.
ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టామని, మొత్తం నాలుగు జోన్లలో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇందులోభాగంగా డంప్‌లను తొలగిస్తున్నామన్నారు. వీధుల్లో ఉమ్మి వేయొద్దంటూ నగరవాసులను హెచ్చరిస్తున్నామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాల్సిందిగా స్థానికులను కోరుతున్నామన్నారు. త ప్పుచేసిన వారిని వదిలిపెట్టబోమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా వీధుల్లో చెత్త పారేస్తే వారికి జరిమానా విధిస్తున్నమన్నారు. ఈ నెల ఏడో తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, వంద రోజులపాటు ఇది కొనసాగుతుందని అన్నారు.
వారం రోజుల ముందే..
Published Wed, Sep 24 2014 10:01 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement