పార్లమెంట్‌లో ‘గాంధీగిరి’
పంజాబ్‌లో దళితులపై అకృత్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన
కాంగ్రెస్ ఎంపీలకు గులాబీలు ఇచ్చిన బీజేపీ సభ్యులు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బీజేపీ గాంధీగిరి చేసింది. లోక్‌సభలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు గులాబీలు ఇచ్చి శాంతిపజేసే ప్రయత్నం చేసింది. పంజాబ్‌లో దళితులపై అకృత్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలు రద్దు చే సి, పంజాబ్‌లో దళితుల అంశంపై చర్చించాలని కాంగ్రెస్ ఇచ్చిన నోటీసులను స్పీకర్ సుమిత్రా మహజన్ తిరస్కరించారు. దీంతో వారు వెల్ లోకి దూసుకెళ్లి ప్రధాని మోదీ, అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని షేమ్.. షేమ్.., పంజాబ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో వెల్‌లోకి వెళ్లిన బీజేపీ సభ్యులు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు గులాబీలు అందించారు.
కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే మాట్లాడుతూ దళితుల అంశం కీలకమైనదని, దీనిపై చర్చించేందుకు అనుమతించాలని అన్నారు. అందుకు అనుమతించని స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం జీరోఅవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. పంజాబ్‌లో దళితులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. బీజేపీ, అకాలీదళ్ ఈ ఆరోపణలను తోసి పుచ్చాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జేడీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
స్వచ్ఛభారత్ ద్వారా రూ.10వేల కోట్లు
స్వచ్ఛ్ భారత్ సెస్ రూ. 10 వేల కోట్లు వస్తుందని అంచనా: స్వచ్ఛ్ భారత్ సెస్ కింద ఏడాదికి రూ. 10 వేల కోట్లు రాబట్ట వచ్చని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది.