
బైకర్లూ ఖబడ్దార్!
సాక్షి, న్యూఢిల్లీ: షబ్ ఏ బారాత్‌ను పురస్కరించుకుని శుక్ర వారం నగర రోడ్లపై స్వైరవిహారం చేసే బైకర్లను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం తీవ్రంగా హెచ్చరించారు. యువత బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. ప్రతి ఏడాది షబ్ ఏ బారాత్ సందర్భంగా బైకర్లు శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు శ్రుతి మించుతుండడం తో, యువతను అదుపులో పెట్టాలని జంగ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. షబ్ ఏ బారాత్‌ను పురస్కరించుకుని శాంతి భద్రతలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి సమస్య సృష్టించరాదని నజీబ్ జంగ్ యువతను కోరారు. సమస్యలు సృష్టించే వారెవరైనా వయస్సుతో నిమిత్తం లేకుండా కఠిన చర్య చేపట్టవలసిందిగా పోలీసులను ఆదేశించారు.
షబ్ ఏ బారాత్ ప్రార్థనలతో గడపాల్సిన రోజని, మృతులకు నివాళులు సమర్పించాల్సిన రోజని నజీబ్ జంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా, బైకర్లను అదుపులో పెట్టడం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బైకర్లు శాంతి భద్రతలకు అంతరాయం సృష్టించకుండా ఉండడం కోసం పలుచోట్ల బారికేడ్లు అమర్చారు. గత సంవత్సరం షబ్ ఏ బారాత్ సందర్భంగా వందల మంది యువకులు మోటారుబైకులపై రాత్రి వేళ రోడ్లపైకి, ముఖ్యంగా ఇండియా గేట్ వద్దకు వచ్చి ఫీట్లు చేస్తూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వారి అల్లరిచేష్టలు తెల్లవారుఝామువరకు కొనసాగాయి.
దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ సంవత్సరం వారిని అదుపులో పెట్టాలని నిర్ణయించారు. ఐటీఓ వద్ద బహదూర్‌షా మార్గ్ నుంచే బారికేడ్లను అమర్చి బైకర్లు గుంపులు గుంపులుగా ఇండియా గేట్ సి హెక్సాగన్ వద్దకు చేరుకోకుండా చూడాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి బారికేడ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులను కూడా మోహరిస్తామని, సరైన పత్రాలు కలిగి హెల్మెట్లు ధరించిన బైకర్లను మాత్రమే బారికేడ్లు దాటి వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. పాత ఢిల్లీ ప్రాంతంలో మత పెద్దలతో కూడా ఈ విషయమై మాట్లాడి వారిని జాగరూకులను చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులు బీట్ కానిస్టేబుళ్లను ఆదేశిం చారు.