స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ కూడా పాలుపంచుకున్నారు. స్థానిక బంగ్లాసాహిబ్ గురుద్వారాలో ఆయన భక్తుల పాదరక్షలను శుభ్రం చేశారు. సతీమణి అమీనాతో
న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ కూడా పాలుపంచుకున్నారు. స్థానిక బంగ్లాసాహిబ్ గురుద్వారాలో ఆయన భక్తుల పాదరక్షలను శుభ్రం చేశారు. సతీమణి అమీనాతో కలిసి వచ్చిన ఎల్జీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘భారత్... పరిశుభ్రంగా ఉండాలనే మహాత్మాగాంధీ కల. అటువంటి కార్యక్రమమే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. దీంతో ఆయన కల సాకారమవుతోంది. జాతీయ రాజధాని నగరంలో ఇది ఐదేళ్లపాటు జరగనుంది. ఢిల్లీని పరిశుభ్రం చేసే విషయంలో నగర పాలక సంస్థలు, ఆస్పత్రులతోపాటు ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలి. పరిశుభ్రతను ఓ అలవాటుగా మార్చుకుందాం’ అని అన్నారు. అందువల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఎంతోకాలంగా ఈ గురుద్వారాకు రావాలని అనుకుంటున్నాన ని, అందువల్లనే స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించానని, దీంతో తన కోరిక తీరిందని ఆయన పేర్కొన్నారు. మనది లౌకికవాద దేశమని, అందువల్లనే ఈ ప్రార్థనామందిరానికి వచ్చానని అన్నారు.