swach bharat abhiyan
-
ప్లాస్టిక్ రహిత సంస్థగా ఎస్బీఐ
హైదరాబాద్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. ఏడాది లోపు ఎస్బీఐను ప్లాస్టిక్ రహిత సంస్థగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొంది. 2022 వరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని భావిస్తున్న కేంద్ర నిబద్ధతకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్ అభియాన్‌కు అనుగుణంగా ఎస్బీఐ ఈ కీలక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించింది. వచ్చే 12 నెలల్లో, ఎస్బీఐను ప్లాస్టిక్ రహిత సంస్థగా మార్చేందుకు దశల వారీగా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. తమ ఆఫీసుల్లో, మీటింగుల్లో పెట్ వాటర్ బాటిళ్లను(ప్లాస్టిక్ బాటిళ్లను), నీటి పంపిణీదారితో భర్తీ చేయనున్నామని చెప్పింది. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు నాణ్యమైన కాగితపు ఫోల్డర్లను వాడుతామని పేర్కొంది. భోజనశాలల్లో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పర్యావరణ హిత పాత్రలను వినియోగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ముంబైలో జరిగిన క్లీన్‌నెస్ డ్రైవ్‌లో చైర్మన్‌తో పాటు 300 మంది ఎస్బీఐ ఉద్యోగులు, బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక ప్రధాన కార్యాలయాల్లో ఈ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రత్యేక సందర్భంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. మన దేశంలో రోజు రోజుకీ ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందని, ఇది దేశానికి అతిపెద్ద పర్యావరణ సవాలని పేర్కొన్నారు. -
వైరల్ వీడియో: డ్రైనేజీ శుభ్రం చేసిన సీఎం
పుదుచ్చేరి : స్వచ్ఛ భారత్‌లో భాగంగా మన నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి స్వయంగా పార చేత పట్టుకుని మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటనలను ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నారాయణ స్వామి చేసిన పనిని మెచ్చుకుంటూ.. ‘మీరు ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నట్లు లేరు. చాలా నిజాయితీగానే మురికి కాలువలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్నార’ని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘కార్యకర్తలకు మీరు ఓ రోల్‌మోడల్‌గా నిలిచారు. మీరు చేసిన పని మాకు మరింత ఉత్సాహన్నిచ్చింద’ని కాంగ్రెస్ అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. కానీ మరికొందరు మాత్రం ‘ఇప్పటికైనా మీకు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు అర్థం కావాలని కోరుకుంటున్నాం. వారికి సరైన పరికరాలు అందజేయండి’ అంటూ కామెంట్ చేశారు. -
టాయిలెట్ కోసం ఆమె ఏం చేశారంటే..
పట్నా: సంకల్ప సిద్ధికి, నిబద్థతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు బిహార్‌కు చెందిన ఓ మహిళ. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న అమీనా ఖటూన్ (40) అత్యంత పేదరికాన్ని సైతం ఎదిరించి టాయిలెట్ నిర్మాణం పూర్తి చేసిన వైనం ప్రముఖంగా నిలిచింది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎలా వున్నప్పటికి.. ఆమె సంకల్పానికి మాత్రం స్థానికులు, అధికారులు జేజేలు పలికారు. అంతేకాదు స్వచ్ఛ్ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణంకోసం ఆశ్రయిస్తే ఉదాసీనత ప్రదర్శించిన అధికారులకు చెంపపెట్టులా ఆ పనిని పూర్తి చేసి.. వారి ప్రశంసలందుకోవడం విశేషం. సౌపాల్ జిల్లా పత్రా గ్రామానికి చెందిన అమీనా స్వచ్ఛ్ భారత్ పథకం కింద టాయిలెట్ నిర్మించుకునేందుకు అధికారులను ఆశ్రయించారు. పలుమార్లు సంబంధిత అధికారులు చుట్టూ తిరిగినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తానే స్వయంగా రంగంలో దిగి చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షమెత్తుకుని మరీ తన ఇంట్లో టాయిలెట్ నిర్మించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆమె పట్టుదలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, ఇతర కార్మికులు టాయిలెట్ నిర్మాణ పనులను ఉచితంగా చేసిపెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే విషయం తెలుసుక్ను జిల్లా అధికారులు ఆదివారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఒక చిన్న పిల్లవాని తల్లి, తన జీవనోపాధికోసం కార్మికురాలిగా పని చేస్తున్న నిరుపేద మహిళ చేసిన ప్రత్యేక ప్రయత్నం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు బిహార్ రాష్ట్రం స్వచ్ఛ భారత్ లక్ష్యం అమలులో దిగువ స్థాయిలో ఉంది. లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలమూత్ర విసర్జన పద్ధతినే అనుసరిస్తున్నారు. అయితే, అక్టోబర్ 2, 2019 నాటికి బిహార్‌ను ఓడీఎఫ్‌గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. కానీ...ఒక్క జిల్లాగా కూడా ఓడీఎఫ్ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ) గా ప్రకటితం కాకపోవడం గమనార్హం. కాగా మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా, 2014, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
కర్సేవలో పాల్గొన్న నజీబ్‌జంగ్
న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ కూడా పాలుపంచుకున్నారు. స్థానిక బంగ్లాసాహిబ్ గురుద్వారాలో ఆయన భక్తుల పాదరక్షలను శుభ్రం చేశారు. సతీమణి అమీనాతో కలిసి వచ్చిన ఎల్జీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘భారత్... పరిశుభ్రంగా ఉండాలనే మహాత్మాగాంధీ కల. అటువంటి కార్యక్రమమే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. దీంతో ఆయన కల సాకారమవుతోంది. జాతీయ రాజధాని నగరంలో ఇది ఐదేళ్లపాటు జరగనుంది. ఢిల్లీని పరిశుభ్రం చేసే విషయంలో నగర పాలక సంస్థలు, ఆస్పత్రులతోపాటు ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలి. పరిశుభ్రతను ఓ అలవాటుగా మార్చుకుందాం’ అని అన్నారు. అందువల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఎంతోకాలంగా ఈ గురుద్వారాకు రావాలని అనుకుంటున్నాన ని, అందువల్లనే స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించానని, దీంతో తన కోరిక తీరిందని ఆయన పేర్కొన్నారు. మనది లౌకికవాద దేశమని, అందువల్లనే ఈ ప్రార్థనామందిరానికి వచ్చానని అన్నారు.