త్వరలోనే నిర్ణయం
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి త్వరలోనే తొలగిపోనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలియజేసింది. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ తమకు సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ ...ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్‌దత్తూ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుంద న్న ఆశతో శుక్రవారం నాటి సుప్రీంకోర్టు కార్యకలాపాలను గమనించిన వారికి కేసు విచారణ వాయిదాపడడం నిరాశ మిగిల్చింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా ? లేక ఎన్నికలు జరిపించాలా? అనే అంశంపై కేంద్రం తీసుకునే నిర్ణయం... హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లయితే ఢిల్లీలో ఎన్నికలు జరపించవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్న దృష్ట్యా ప్రభుత్వ వైఖరిని తెలపడానికి లెఫ్టినెంట్ గవర్నర్ మరికొంత సమయం కోరవచ్చనే ఊహాగానాలు ముందుగానే వినిపించాయి.
ప్రభుత్వం శుక్రవారం కోర్టును మరికొంత సమయం కోరడం ఈ ఊహాగానాలను బలపరిచింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకుగల అవకాశాలను అన్వేషించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ లెప్టినెంట్ గవర్నర్ రాసిన లేఖ ఇంకా రాష్ట్రపతి పరిశీలన కోసం ఎదురుచూస్తోందని, దానిపై త్వరలో నిర్ణయం వెలువడవచ్చని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ విషయంపై ప్రభుత్వం తరపున గతంలో న్యాయస్థానం ఎదుట హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ వ్యక్తిగత సమస్యల కారణంగా కూడా కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసిందని అమన్ అనే న్యాయవాది తెలిపారు.
ఇదిలాఉంచితే ఢిల్లీలో ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. సుప్తచేతనావస్థలో నున్న అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి లేఖ రాశారని, సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ప్రభుత్వం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనానికి తెలిపింది. ఈ ప్రకియ ఫలితాన్ని అక్టోబర్ 10న తనకు తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనట్లయితే పార్టీల మార్పిడికి ప్రోత్సాహం లభిస్తుందని హెచ్చరించింది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు.
ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.