న్యూఢిల్లీ: విద్యుత్ కోత వేళల షెడ్యూల్ ముందుగానే ప్రకటించాలని డిస్కంలను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశించారు. అదేవిధంగా నగరంలోని మాల్స్‌కు రాత్రి పది గంటలతర్వాత కోత విధించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో సమావేశమై నగరంలో విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. ‘మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు, మళ్లీ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంటదాకా విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. అందువల్ల ఏయే సమయాల్లో కోత ఉంటుందనే విషయాన్ని ఆయా పంపిణీ సంస్థలు ముందస్తుగా ప్రకటించాలి’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు నగరంలోని హైమాస్ట్ దీపాలు విద్యుత్‌ను భారీగా వినియోగించుకుంటాయని, అందువల్ల డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో వాటిని ఆపివేయాలన్నారు. విద్యుత్ కొరత సమస్యను అధిగమించేందుకు అవలంబించాల్సిన విధానాలను ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
కొన్ని ప్రాంతాల్లో ఇంకా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, అందువల్ల విద్యుత్ సరఫరాలో కోత తప్పదని ఈ సందర్భంగా ఎల్జీ పేర్కొన్నారు. పెనుదుమారం కారణంగా దెబ్బతిన్న టవర్ల పునరుద్ధరణ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోందన్నారు. డిస్కంలు... తమ కాల్‌సెంటర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు. మరోవైపు ప్రజలు కూడా విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగించుకోవాలని సూచించారు. కార్యాలయతోపాటు ఇళ్లల్లోని ఎయిర్ కండిషనర్లను అవసరమైన మేరకే వాడుకోవాలన్నారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ ట్రాన్స్‌కో సంస్థకు చెందిన ఉన్నతాధికారులతోపాటు అన్ని డిస్కంల సీఈఓలు పాల్గొన్నారు.
కోత వేళలు ప్రకటించండి
Published Sun, Jun 8 2014 9:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement
Advertisement