
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. అసెంబ్లీలో తమకు తగినంత బలం లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు తెలిపినట్టు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వనందున ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పామన్నారు.
ఈ సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో హర్షవర్థన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు గవర్నర్ తనను ఆహ్వానించారని హర్షవర్థన్ తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము నిరాకరించామని ఆయన వెల్లడించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెల్చుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది.