ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వానికి రెఫరెండం కాబోవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
నెల్లూరు/ఆత్మకూరు/ పొదిలి: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వానికి రెఫరెండం కాబోవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ప్రకటించేవి ఎగ్జిట్‌పోల్స్ అని తరువాత ఎగ్జాట్ పోల్స్ వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు బకింగ్ హం జలమార్గాన్ని కూడా మరో మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరినట్లు శ్రీకాళహస్తి-నడికుడి రైల్యే లైను పూర్తి చేస్తామన్నారు.
కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని..ఎటూ అధికారంలోకి వచ్చేది లేదని రాష్ట్ర విభజన సమయంలో అలవికాని హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత మువ్వల శ్రీహరి విగ్రహాన్ని ప్రకాశం జిల్లా పొదిలిలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు.