పెంటపాటి పుల్లారావు
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. పోటాపోటీగా సాగనున్న ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని రంగంలోకి దించి ఆమ్‌ఆద్మీనే కాక, కాంగ్రెస్‌ను కూడా బీజేపీ ఖంగు తినిపించింది. మోదీ పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే చాలదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది.
అమెరికా, ఇంగ్లండ్, రష్యా లేదా ఫ్రాన్స్ దేశాల రాజధాని నగరాల మేయర్లు ఎవరో ఎవరూ పట్టించుకోక పోవడం విచిత్రం. అంతదాకా ఎందుకు, హైదరాబాద్ లేదా ముంబై మేయర్ ఎవరో గుర్తుందా? ఆ నగరాలలో చాలావాటికంటే ఢిల్లీ చిన్నది. కానీ ఆ ఎన్నికలే రాజకీయవేత్తలందరికీ అతి కీలకమైనవి. మీడియా సైతం మిగతా రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇచ్చే దాని కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఢిల్లీకి ఇస్తుంది. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత 2013లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ, ఆ పార్టీని నిర్ణయాత్మకంగా ఓడించింది. దాని ఓటు బ్యాంకులన్నిటినీ కొల్లగొట్టింది. ఢిల్లీ శాసనసభ 70 స్థానాల్లో బీజేపీ 31, ఆప్ 28, గెలుచుకోగా, కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితమైంది. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ సైతం ఓటమిపాలై, ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు.
2014 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 స్థానాలను భారీ ఆధిక్యతతో గెలుచుకుంది. కానీ రాష్ట్ర స్థాయి ఎన్నికలు అందుకు భిన్నమైనవి. హఠాత్తుగా కేజ్రీవాల్ బాగానే గడబిడ చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం తిరిగి పూర్వప్రాభవం గురించి కలలు కంటోంది. షీలా దీక్షిత్‌ను పక్కకు తప్పించి అజయ్ మాకెన్‌ను ప్రచార సారథిని చేసింది.
పార్లమెంటు ఎన్నికల తదుపరి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. ఢిల్లీలో ఓడిపోతే, ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. పార్టీ వృద్ధిని నిరోధిస్తుంది. ఏది ఏమైనా బీజేపీని నిలువరిం చాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ వంటి బీజేపీ మిత్రపక్షాలు సైతం అది ఓడిపోతేనే అదుపులో ఉంటుందని సంతోషిస్తాయి. నిజానికి రిటైరయిన బీజేపీ సీనియర్ నాయకత్వం ఢిల్లీలో ఓడిపోవాలనే కోరుకుంటుంది. ఇక కాంగ్రెస్ 2013లో దక్కించుకున్న 8 సీట్ల కంటే మెరుగ్గా రాణించాలి. అప్పుడే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు కాగలుగుతారు. మోదీ విజయాలు, నాయకత్వ శైలి గాంధీ కుటుంబంలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. జైల్లో ఉండాల్సింది పోయి ఆయన ప్రధాని అయ్యారు. అవమానానికి లేదా నిర్లక్ష్యానికి గురికావడానికి గాంధీ కుటుంబం అలవాటు పడినది కాదు. అందుకే ఓటమిని జీర్ణించుకోలేక పోతోంది.
ఇక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలి. లేకపోతే భారీగా నష్టపోయి, మరపునపడి పోతారు. అధికార వర్గేతర పార్టీ ఆమ్‌ఆద్మీ కేజ్రీవాల్ నేతృత్వాన ఢిల్లీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం గొప్ప రాజకీయ ప్రయోగం. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే అలాంటి ప్రయోగం తిరిగి మరెన్నడూ జరగదు. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్, కేజ్రీవాల్‌లకు అస్తిత్వ సమస్య. ఇక బీజేపీ ఓటమి పాలవడం అంటే మోదీ, అమిత్‌షాలు ప్రతిష్టను కోల్పోవడం. ఇక బీజేపీని నిలవరించడానికి ప్రతిపక్షాలు ఒక్కటవుతాయి.
కాంగ్రెస్ వ్యూహం
కాంగ్రెస్‌కు అపార నిధులున్నాయి. ఢిల్లీలో పెద్ద క్యాడరూ ఉంది. ఆ పార్టీ నేతలు గత 60 ఏళ్లుగా అంతులేని అధికారాన్ని అనుభవించినవారు. సానుభూతి లభిస్తుందేమోనన్న ఆశతో ఈసారి ఆ పార్టీ ప్రతిచోటా సీనియర్ నేతలను బరిలోకి దించుతోంది. దురదృష్టవశాత్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమ పుత్రిక శర్మిష్ట ముఖర్జీని కాంగ్రెస్ తరఫున పోటీకి దిగనిచ్చారు. ఆయన కుమారుడు బెంగాల్ నుంచి ఎంపీ. ఆయనేమో రాష్ట్రపతి. మొత్తం కుటుంబ మంతా ఇలా అధికారానికి అర్రులు చాచడం మంచిది కాదు. కాంగ్రెస్ చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేస్తుంది.
2013లో వచ్చిన 24 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీ పునరుజ్జీవనం ఇక కలే. అందుకే ఒకప్పటి కాంగ్రెస్ సానుభూతిపరులంతా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో లబ్ధి పొందిన నామినేటెడ్ ఎంపీలు, గవర్నర్లు, కొందరు ‘మేధావులు’ కూడా వేచి చూస్తు న్నారు. ఓడ ఎప్పుడు మునిగిపోతుందో దాన్లో ఉన్న ఎలుకలు ముందుగా పసిగట్టి దుంకేస్తాయి. అలాగే చాలా మంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.
కేజ్రీవాల్ వ్యూహం, బలహీనతలు
కేజ్రీవాల్ 2013 ఎన్నికలకు ముందు రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ధూషించి, అవమానించిన తీరు సిగ్గుచేటైనది. అయినా ఆయన గొప్ప అద్భుతాలు చేసి కాంగ్రెస్, బీజేపీలను ఓడించి గెలుపొందారు. ముఖ్యమంత్రి అయ్యాక కేజ్రీవాల్ ఆమోదయోగ్యంకాని రీతిలోఅహంకారిగా తనను బయటపెట్టుకున్నారు. షాజియా ఇల్మీ, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్ లు సహా వేలాది మంది ఇతరులు ఆయనను ఎందుకు వదలి పోయారు? అధికారంతో పాటూ సంక్రమించే అహంకారం వ్యక్తిని నాశనం చేస్తుంది. 2013లో ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున వేలాది మంది ప్రముఖులు ప్రచారం చేశారు. రాజకీయ కార్యకర్తలంతా జీతభత్యాలకు పనిచేసేవారుగా ఉన్న ఈ కాలంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా తెలివి తేటలు, ఉత్సాహోత్తేజాలు గల వేలకొలది కార్యకర్తలు ఢిల్లీలో కేజ్రీవాల్‌కు లభించారు.
కానీ ఆయన ఆత్మహత్యా సదృశమైన బాట పట్టి, జనాదరణ గలిగిన నేతలందరినీ అవమానించడం మొదలెట్టారు. చివరికి ఒంటరిగా మిగిలారు. అయినా ఆయనకింకా పేదలలో మంచి మద్దతుంది. కాకపోతే అయన శక్తియుక్తులు, నైపుణ్యం గలిగిన నేతలంతా బీజేపీకి చేరువయ్యారు. వారణాసి నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయడం, ఆయనపై విమర్శలు గుప్పిస్తుండటం వల్ల కేజ్రీవాల్‌కు ముస్లింల మద్దతు ఉంది. బీజేపీ మధ్య తరగతిని, దళితులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఆయన ఆ వర్గాల మద్దతును కోల్పోవాల్సి వస్తుంది. ‘‘శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు ఆటంకం కలిగించవద్దు’’ అని నెపోలియన్ చెప్పాడు. కేజ్రీవాల్ సరిగ్గా దానికి విరుద్ధంగా బీజేపీకి గొప్ప ముఖ్యమంత్రి అభ్యర్ధి లేడని దాడి సాగిస్తూ తప్పు చేశారు.
విజయ్ గోయల్, విజేందర్ గుప్త, ముఖి తదితరులు జనాకర్షణ ఏమాత్రం లేని వారే. మిగతావారంతా పనికిరానివాళ్లు కాబట్టి ప్రజలు తననే ఎంచుకుంటారని కేజ్రీవాల్ భావించారు. కానీ అమిత్‌షా తమ తప్పును గ్రహించి షాజియా ఇల్మీ, కిరణ్‌బేడీలను రంగంలోకి దించారు. అదే పనిగా విమర్శిస్తుండటం అంటే ప్రత్యర్థి తప్పలు సరిదిద్దు కునేట్టు చేయడమేననే గుణపాఠం ఆయన నేర్చుకోవాల్సి ఉంది. ఒకప్పటి కేజ్రీవాల్ మద్దతుదార్లకూ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు జీతభత్యాలు లేని కార్యకర్తలు ఉండేవారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఉన్నది అత్యుత్సాహంతో ఉన్న శత్రువులే.
బీజీపీ బలాలు, బలహీనతలు
బీజేపీలో కేజ్రీవాల్‌కు సరితూగే నేతలెవరూ లేరని, ప్రజలు బలమైన, చైతన్యశీలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ పార్టీ సర్వేల్లో వెల్లడైంది. అందుకే అది రిటైర్డ్ పోలీస్ అధికారి కిరణ్‌బేడీని పార్టీలో చేర్చుకుంది. ‘‘ఆశ్చర్యంలో ముంచెత్తడం గొప్ప సానుకూలతను కలుగజే స్తుంది’’ అని ప్రాచీన చైనా వ్యూహకర్త సున్ జు అన్నాడు. జనాదరణలో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని తెచ్చి బీజేపీ ఆప్ నేతనే కాదు, కాంగ్రెస్‌ను కూడా ఖంగు తినిపించింది. ఆకస్మికమైన ఈ ఆశ్చర్యకరమైన ఎత్తుగడతో బీజేపీ కొంత సానుకూలతను సాధించింది. ఇక బీజేపీకి నరేంద్రమోదీ ఎలాగూ ఉండనే ఉన్నారు. కేజ్రీవాల్‌ను అధికారంలోకి తేవడం వల్ల ఫలితం శూన్యమని, కేంద్రం మద్దతు లేనిదే ఆయనేమీ చేయలేడని ఢిల్లీలో చాలామంది భావిస్తున్నారు. పైగా దళిత, ముస్లిం ఓటర్లలో 2014 నాటికంటే ఇప్పడు బీజేపీ వ్యతిరేకత తక్కువగా ఉంది. కాంగ్రెస్ హయాంలో కంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. చమురు ధరల తగ్గుదల పుణ్యమాని ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.
ఈ సానుకూల పరిస్థితి బీజేపీకి ఉపయోగపడుతుంది. 2013లో కేజ్రీవాల్‌కు ఓటు వేసిన మధ్యతరగతి, యువత పెద్ద సంఖ్యలో బీజేపీ పక్షానికి చేరారు. నెల క్రితం వరకు బీజేపీ గెలుపుపై చాలా ధీమాగా ఉంది. కానీ మెజారిటీ దక్కకపోవచ్చునేమోనని ఇప్పడు ఆందోళన చెందుతోంది. ఢిల్లీలో అది ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. కేరళ, తమిళనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పార్టీని పెంపొందింపజేయాలన్న లక్ష్యానికి హాని కలుగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడమంటే కాంగ్రెస్, ప్రతి పక్షాలు నీరసపడిపోవడమే.
దేశంలో అన్ని చోట్లా తమకు సరిపడేటంతమంది నేతలు లేరనే గుణపాఠాన్ని బీజేపీ ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. పోటాపోటీగా సాగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ధీటైన నేత తమకు లేరు కాబట్టే కిరణ్ బేడీని ఆహ్వానించి పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడాలంటే ఇతర పార్టీల నేతలను ఆహ్వానించక తప్పదు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. ప్రధాని స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే సరిపోదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది. ఆ పార్టీ రేపు ఏ దిశగా సాగనున్నదో ఢిల్లీ ఫలితాలు సూచిస్తాయి.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)