మీ పాలనలో మహిళలకు భద్రత కరువు
- బీజేపీపై కేజ్రీవాల్ ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు పాలనలో ఢిల్లీలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత కరువైందని ఆప్ నేత కేజ్రీవాల్ విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడమంటే వారిని నాలుగు గోడల మధ్య బంధించడమన్నదే బీజేపీ విధానమని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో 10-15 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏరా్పాటు చేసి, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు.
తాను తన కోసం ధర్నాలు చేయలేదని, ప్రజల కోసం చేశానని చెప్పారు. ‘‘ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత గత తొమ్మిది నెలల్లో ఢిల్లీలో రేప్ ఘటనలు 30 శాతం పెరిగాయి. 2,069 ఘటనలు చోటుచేసుకున్నాయి’’ అని వివరించారు.
అమ్మాయిలు జీన్ ప్యాంట్లు వేసుకోకూడదు, చదువుకోకూడదన్నది బీజేపీ విధానమైతే.. కట్టుదిట్టమైన చర్యలతో వారిపై అఘాయిత్యాలను అరికట్టడం తమ విధానమని పేర్కొన్నారు. ఈ రెండింట్లో ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. కిందటేడాది 49 రోజుల్లోనే ఢిల్లీ సీఎం పీఠం నుంచి దిగిపోయినందుకు కేజ్రీవాల్ మరోసారి ప్రజలకు క్షమాపణలు చెప్పారు.