
పెరుగుట విరుగుట కొరకేనా?
ఈ వ్యూహం జమ్మూ-కశ్మీర్ ఎన్నికల వరకూ ఫలించింది. ఢిల్లీలో బెడిసి కొట్టింది. ఈ పరిణామాన్ని కొందరు ఆరెస్సెస్ నాయకులు ముందుగానే ఊహించారు. వారి హెచ్చరికలను పట్టించుకునే స్థాయిని మోదీ, షా దాటిపోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చినప్పడు మోదీ వ్యవహరించిన తీరు, పది లక్షల ఖరీదు చేసే డిజైనర్ కోటు వేసుకోవడం, మూడుసార్లు మాత్రమే కలుసుకున్న ఒబామాతో అనేక దశాబ్దాల స్నేహం ఉన్నట్టు బరాక్ అంటూ సంబోధించడం ఆరెస్సెస్ నాయకులకు రుచించి ఉండదు.
ఢిల్లీలో శనివారం పోలింగ్ జరిగిన సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించిన అన్ని సంస్థలూ ఆమ్‌ఆద్మీపార్టీ (ఏఏపీ- ఆప్)కే ఆధిక్యం ఉంటుందని స్పష్టంగా చెబుతున్నాయి. అసలు ఫలితాలు పదో తేదీన వెల్లడయ్యే వరకూ వీటిని సర్వే ఫలితాలుగానే పరిగణించాలి. పోలింగ్‌కు మూడు వారాల వ్యవధి ఉన్నదనగా మాజీ పోలీసు ఉన్నతాధికారి కిరణ్‌బేడీని భారతీయ జనతా పార్టీ (భాజపా) ముఖ్య మంత్రి అభ్యర్థిగా రంగంలో దింపినప్పుడు అది చాలా మంచి ఎత్తుగడ అనీ, భాజపా గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించినవారిలో నేనూ ఒకడిని. భాజపావైపే రవ్వంత మొగ్గుందని కూడా రాశాను. ఇందుకు కారణాలు లేక పోలేదు. నరేంద్రమోదీ సార్వత్రిక ఎన్నికల సమయంలో సృష్టించిన ప్రభంజనం అప్పటికీ కొనసాగుతున్నట్టే కనిపించింది. ఢిల్లీలో రెండు వేల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శాఖలున్నాయి. వేలమంది కార్యకర్తలు ఓటర్లకు నచ్చజెప్పడంలో, పోలింగ్ కేంద్రాలకు తీసుకొనివెళ్లి ఓట్లు వేయించడంలో అనుభవం కలిగినవారు. లోక్‌సభ ఎన్నికలలో ఆప్‌కు ఢిల్లీలోని ఏడు స్థానాలలో ఒక్కటంటే ఒక్కటీ రాలేదు.
భాజపా ఢిల్లీ విభాగం నాయకులలో ముఠాలు ఉన్నాయని తెలుసు. పార్టీ అధ్యక్షు డు అమిత్ షా నయానోభయానో వారిని ఒకే తాటిమీదికి తెస్తారని అనుకున్నాం. పైగా లోక్‌సభ ఎన్నికలలో కానీ అనంతరం జరిగిన మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో కానీ మోదీ-షా ద్వయం స్థానిక నాయకుల మద్ద తుతో నిమిత్తం లేకుండానే ఘనవిజయాలు సాధించారు. మహారాష్ట్రలో పాతికేళ్ళ భాగ స్వామి శివసేనను తోసిరాజని జయభేరి మోగించారు. మోదీ జనాకర్షకశక్తి, షా యుద్ధ నైపుణ్యం, కిరణ్‌బేడీ పేరుప్రతిష్ఠల కారణంగా భాజపా గట్టెక్కుతుందని భావించాం.
ఆ విభజన రేఖే కొలబద్ద
ఎగ్జిట్ పోల్స్ నిర్ద్వంద్వంగా ‘పహలే ఆప్’ అని చాటుతున్నాయి కనుక భాజపా పరా జయానికి దారితీసిన కారణాలను గుర్తించడం కష్టం కాదు. ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ మధ్య విభజన రేఖ చాలా సన్నగా ఉంటుంది. ఒకరికి ఆత్మవిశ్వాసంగా కనిపించిన ధోరణి మరొకరికి అహంకారంగా కనిపించవచ్చు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కూ అహంకారం ఎంతోకొంత ఉన్నప్పటికీ వినయసంపన్నుడుగా కనిపించ గలరు. మోదీ అటువంటి ప్రయత్నం కూడా చేయరు. మోదీ ఆత్మవిశ్వాసాన్ని ప్రజలు అహంకారంగా ‘అపార్థం’ చేసుకున్నారని అనుకోవాలి. ఢిల్లీ ఎన్నికలు వెస్ట్‌మినిస్టర్ పద్ధతిలో అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగినప్పటికీ ప్రచారం మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించింది. కిరణ్ బే డీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో అగ్రభాగాన నిలిపినప్పటికీ ప్రజల హృదయాలలో పోటీ నరేంద్రమోదీకీ, కేజ్రీవాల్‌కీ మధ్యనే. అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీ ఎన్నికలను మోదీ ప్రభుత్వం పనితీరుపై తీర్పుగా (రెఫరెండంగా) పరిగణించరాదంటూ పదేపదే చెప్పినప్పటికీ ఓటర్లు మాత్రం మోదీ, కేజ్రీవాల్‌కీ మధ్య పోరాటంగానే భావించి మోదీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. నిజంగా భాజపా ఓడిపోతే అది మోదీ పరాజ యం అవుతుంది కానీ కిరణ్ బేడీ ఓటమి కాజాలదు. మోదీ, అమిత్ షా ఢిల్లీ ఎన్నికలకు అసాధారణ ప్రాధాన్యం ఇచ్చి వాటికి మినీ జాతీయ ఎన్నికల స్థాయి కల్పించడమే కాకుండా కేజ్రీవాల్‌పైన విమర్శనాస్త్రాలన్నింటినీ సంధించి ఆప్ నాయకుడి స్థాయిని స్వయంగా ఆకాశం ఎత్తుకు పెంచారు. ఎత్తుగడలూ, వ్యూహప్రతివ్యూహాలూ గమనించి నట్లయితే హస్తిన సంగ్రామంలో అధికార పక్షానికి మోదీ-షా ద్వయం నాయకత్వం వహిస్తే ఆప్‌కు కేజ్రీవాల్ ఒక్కరే సారథి. సిద్ధాంతకర్త యోగేంద్రయాదవ్ సంపూర్ణ సహకారం అదించిన మాట వాస్తవమే కానీ మొత్తం ఆప్ యుద్ధతంత్రానికి రూపకల్పన చేసింది కేజ్రీవాల్ మాత్రమే. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
ముఖాముఖీ పోటీయే
హస్తిన పోరు రెండు బలమైన వ్యక్తిత్వాల మధ్య, రెండు భావజాలాల మధ్య, రెండు ధోరణుల మధ్య జరిగింది. 2014 మే సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోదీ అట్టహా సంగా రంగప్రవేశం చేసి సుడిగాలి పర్యటనలు చేసి సునామీ సృష్టించి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. సార్వత్రిక ఎన్నికలలో కానీ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఎన్నికలలో కానీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతోనే. ఆ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అప్పటికే డీలాపడిపోయారు. యుద్ధానికి పూర్వమే పరాజయం అంగీకరించినట్టు కనిపించారు. అనూహ్యమైన రీతిలో అనతి కాలంలో అజేయ శక్తిగా ఎదిగిన మోదీకి దీటైన ప్రత్యర్థిగా కేజ్రీవాల్ నిలిచి ఢిల్లీ బస్తీ మే సవాల్ అన్నారు. మోదీ తన స్థాయిని విస్మరించి కేజ్రీవాల్‌పైన వ్యక్తిగత విమర్శలు చేశా రు. కేజ్రీవాల్ తెలివైన రాజకీయ నాయకుడు. ప్రధానిగా మోదీకి ఇప్పటికీ ప్రజామోదం దండిగా ఉన్నదనే ఎరుక ఆయనకు ఉంది. అందుకే మోదీపైన వ్యక్తిగత విమర్శలు చేయలేదు. జాతీయ స్థాయిలో ప్రధానిగా మోదీని ప్రజలు ఎన్నుకున్నారనీ, ఢిల్లీకి ఆయన ముఖ్యమంత్రి కాలేరు కనుక ఆ పదవికి తనను ఎన్నుకోవాలనీ వాదించారు.
2013 డిసెంబర్‌లో షీలాదీక్షిత్‌పై విజయం సాధించి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ జనలోక్‌పాల్ బిల్లు పేరుతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఈ ఎన్నికలలో ఆయనకు ప్రతికూలాంశంగా మారుతుందని భాజపా నాయకత్వం భావించింది. అందుకే ఎన్నికల ప్రచారంలోనూ, టీవీ చర్చా గోష్ఠులలోనూ భాజపా నాయకులు 49 రోజుల తర్వాత పదవి విడిచి పారిపోయిన కేజ్రీవాల్ అరాచకవాది అంటూ నిందించారు. ధర్నాలు చేయడం ఆప్‌కు అలవాటు. పరిపాలన చేయడం భాజపాకు తెలుసు. అందుకని ఎవరికి తెలిసిన పని వారికి అప్ప గించాలంటూ ప్రధాని రాంలీలా మైదానంలో భాజపా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ పిలుపు నిచ్చారు. ఇదే అంశాన్ని కేజ్రీవాల్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. రెండు నెలలు నిండక ముందే పదవికి రాజీనామా చేసినందుకు ఏ మాత్రం భేషజం లేకుండా క్షమాపణ చెప్పడం కేజ్రీవాల్ విజయలక్ష్యం వైపు వేసిన తొలి అడుగు. అనంతరం తాను 49 రోజులలో చేసిన పరిపాలనలోని ప్రజారంజకమైన అంశాలను పేర్కొంటూ అటువంటి పాలనను ఐదేళ్ళపాటు అందించే అవకాశం ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు.
కమలాన్ని ముంచిన ముఠాలు
రెండు పార్టీల ప్రచార శైలిలో సైతం వ్యత్యాసం ఉంది. మోదీ జాతీయ స్థాయి అంశా లను ప్రస్తావిస్తే కేజ్రీవాల్ ఢిల్లీలో సాధారణ ప్రజల నిత్యావసరాల గురించీ, నిత్యం వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారాల గురించీ ప్రస్తావించారు. మంచినీటి సర ఫరా, తక్కువ చార్జీలకు విద్యుచ్ఛక్తి అందించడం, మహిళలకు రక్షణ కల్పించేందుకు అనేక ప్రాంతాలలో కెమేరాలు అమర్చడం వంటి 70 అంశాలతో ఆప్ ఎన్నికల ప్రణాళిక రూపొందించారు. అంతకు ముందు ఢిల్లీ డైలాగ్ అనీ, మొహల్లా సభలనీ పౌరులతో సమాలోచనలు జరిపారు. ఆప్ ప్రచారం కొత్త పోకడలు పోతూ సృజనాత్మకంగా సాగితే భాజపా, కాంగ్రెస్ పార్టీల ప్రచారం పాత పద్ధతులలోనే చప్పగా సాగింది. భాజపా నాయకులు జీపులలో ప్రయాణం చేస్తూ పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ ప్రచారం సాగిస్తే ఆప్ వలంటీర్లు బస్తీలలో ప్రజలతో మాట్లాడిస్తూ, పాటలు పాడుతూ, పాడిస్తూ వారి మధ్యనే గడిపారు. ఆప్ వయస్సు రెండేళ్ళు. భాజపాలో పాతుకుపోయిన నాయకులూ, అలసిపోయిన నాయకులూ ఎక్కువ. వామపక్షాలతో సహా దేశంలోని అన్ని పార్టీలలో విభేదాలు ఉన్నాయి. నానా ముఠాల సమాఖ్యలు మన రాజకీయ పార్టీలు. అన్ని ముఠాలనూ సంతృప్తి పర్చుతూ ఒక తాటిమీద నడిపించడమే పెద్ద పార్టీల నాయకత్వాలు చేస్తున్న పని. ఆ విధంగా కాకుండా మోదీ, షాలు కొంత కరకుగా వ్యవహరించారు. బయటి నుంచి కిరణ్‌బేడీని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా సరాసరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం చాలామంది పాతకాపులకు మనోవేదన కలిగించిన మాట వాస్తవం. భాజపా ప్రతిపక్షంలో ఉన్నంత కాలం పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ అనేక త్యాగాలు చేసిన నాయకులను కాదని కిరణ్‌బేడీని నెత్తిన పెట్టుకోవడం చాలా సాహసంతో కూడుకున్న నిర్ణయం. విజయపరంపర తెచ్చిన ఆత్మ విశ్వాసంతో మోదీ, షాలు ఇటువంటి నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. ఈ వ్యూహం జమ్మూ-కశ్మీర్ ఎన్నికల వరకూ ఫలించింది. ఢిల్లీలో మాత్రం బెడిసి కొట్టింది. ఈ పరిణామాన్ని కొందరు ఆరెస్సెస్ నాయకులు ముందుగానే ఊహించారు. వారి హెచ్చరికలను పట్టించుకునే స్థాయిని మోదీ, షా దాటిపోయారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చినప్పడు మోదీ వ్యవహరించిన తీరు, పది లక్షల ఖరీదు చేసే డిజైనర్ కోటు వేసుకోవడం, మూడుసార్లు మాత్రమే కలుసుకున్న ఒబామాతో అనేక దశాబ్దాల స్నేహం ఉన్నట్టు బరాక్ అంటూ సంబోధించడం ఆరెస్సెస్ నాయకులకు రుచించి ఉండదు.
కాంగ్రెస్ పదేళ్ళ పాలనతో, అంతులేని అవినీతి ఆరోపణలతో విసిగిపోయిన దేశ ప్రజలు ఆ పార్టీని పదవి నుంచి తొలగించి భాజపాకు అధికారం అప్పజెప్పారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలైనప్పటికీ సామాన్య ప్రజల బతుకుల్లోకి వెలుగు ఇంకా తొంగి చూడలేదు. పెట్రోలు ఉత్పత్తుల ధరలు తగ్గినప్పటికీ నిత్యావసర ధరలు తగ్గలేదు. ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలతో బాంధవ్యం పెట్టుకొని, ఆ సంస్థల అధి నేతల ప్రశంసలు అందుకుంటూ వారిని ఆలింగనం చేసుకునే నాయకులను ప్రజలు అభిమానించరు. కార్పొరేట్ రంగానికి జనామోదం అంతగా పెరగలేదు ఇప్పటివరకు. యజమాని అనుమతి లేకుండా పరిశ్రమలకోసం భూమి స్వాధీనం చేసుకోవడానికి వీలుగా భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరించడాన్ని ప్రజలు హర్షించరు. ఇటు వంటి నిర్ణయాలు రేపు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించబోతున్నారు. ప్రజలలో వ్యతిరేకత పెరగడం అనివార్యం.
ఢిల్లీ ఎన్నికలలో భాజపా పరాజయం వల్ల దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తులు బలపడతాయి. భాజపా కనుక ఈ ఎన్నికలలో గెలుపొంది ఉంటే మోదీ హవా నిరాఘా టంగా కొనసాగేది. బీహార్‌లో, పశ్చిమ బెంగాల్‌లో, తమిళనాడులో, ఇతర రాష్ట్రాలలో భాజపా బలపడే అవకాశాలు ఉండేవి. అందుకే మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ ఆప్‌కు ఓటు వేయవలసిందిగా ఢిల్లీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను కేజ్రీవాల్ అమలు చేయగలరా అన్నది పెద్ద ప్రశ్న. కేంద్రంతో పేచీలు పెట్టుకోకుండా, భాజపా నాయకత్వంలో ఉన్న కార్పొరేషన్‌తో తగదా పడకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించడం కేజ్రీవాల్ ముందున్న సవాలు-ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే.
త్రికాలమ్: కె.రామచంద్రమూర్తి