సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ఆదివారంపేట
ముత్తారం(మంథని): ఉమ్మడి ముత్తారం మండలంలోని ఆదివారంపేట జిల్లాస్థాయిలో గుర్తింపు పొందింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛభారత్ మిషన్(జీ)నిర్వహణలో జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. పరిసరాల పరిశుభ్రత, సంపూర్ణ పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, హరితహారం, ఉపాధిపనుల లక్ష్యాన్ని సాధించినందుకు ఈ అవార్డు వరించింది. ఈ మేరకు కలెక్టర్ గ్రామాభివృద్ధికి రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు.
అంతా 100శాతం...
గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లులేదు. ప్రతి వీధిలో సీసీరోడ్లు పరిశుభ్రంగా దర్శనమిస్తాయి. సంపూర్ణ పారిశుద్ధ్యంలో జిల్లాలోనే ఆదర్శంగా ఉంది. సుమారు 58 ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తి అయ్యింది. మరో 100వరకు ప్రగతిలో ఉన్నాయి. స్మశాన వాటిక నిర్మాణం, దోభీఘాట్, పశువుల తొట్టె, స్నానాల గట్టం, డంపింగ్ యార్డ్, మినరల్ వాటర్ ప్లాంట్, ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గతేడాది జాతీయ గ్రామీణ నిర్మల్ పురస్కార్ అవార్డ్‌కు ప్రతిపాదనలు పంపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్యక్షతన గతేడాది అక్టోబర్ 11న అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో నిర్వహించిన జాతీయ సమ్మేళనానికి ఆదివారంపేట సర్పంచ్ మైదం కుమార్‌కు ఆహ్వానం అందగా పాల్గొన్నారు.
పథకాలు ఆన్‌లైన్...
ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలును గ్రామంలో సమర్థ్ధవంతంగా నిర్వర్తించారు. ఎప్పటికప్పుడు ఆయా పథకాల అమలు తీరును ఆన్‌లైన్ చేయయడంలో జిల్లాలోనే ఆదివారంపేట సర్పంచ్ మందజలో ఉన్నారు. దీంతో అధికారులు జాతీయ సమ్మేళనానికి ఎంపిక చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ..శభాష్ అనిపించుకుంటున్నారు.
గ్రామస్తుల సహకారంతో..
గ్రామస్తుల సహకారంతోనే గ్రామాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగింది. గ్రామస్తులు ప్రోత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దీంతో ఆదివారంపేట జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైయ్యింది.– మైదం కుమార్,సర్పంచ్ ఆదివారంపేట
అన్నిరంగాల్లో ఆదర్శం
పరిసరాల పరిశుభ్రత, సంపూర్ణ పారిశుద్ధ్యంలోనే కాదు అభివృద్ధిలోను ఆదివారంపేట ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో ప్రజల మౌలిక అవసరాలకు అనుకూలంగా అన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక కావడం గ్రామస్తుల అదృష్టం.– కలవేన సదానందం, స్థానికుడు
ప్రొఫైల్
జనాభా: 1964
మహిళలు: 957
పురుషులు: 1007
ఇళ్లు: 567
మరుగుదొడ్లు: 100శాతం
సీసీ రోడ్లు: 100శాతం
అంగన్‌వాడీ కేంద్రాలు: 2
ప్రభుత్వ పాఠశాలలు: 1
Comments
Please login to add a commentAdd a comment