adivarampeta
-
ఆదర్శం..ఆదివారంపేట
ముత్తారం(మంథని): ఉమ్మడి ముత్తారం మండలంలోని ఆదివారంపేట జిల్లాస్థాయిలో గుర్తింపు పొందింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛభారత్ మిషన్(జీ)నిర్వహణలో జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. పరిసరాల పరిశుభ్రత, సంపూర్ణ పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, హరితహారం, ఉపాధిపనుల లక్ష్యాన్ని సాధించినందుకు ఈ అవార్డు వరించింది. ఈ మేరకు కలెక్టర్ గ్రామాభివృద్ధికి రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. అంతా 100శాతం... గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లులేదు. ప్రతి వీధిలో సీసీరోడ్లు పరిశుభ్రంగా దర్శనమిస్తాయి. సంపూర్ణ పారిశుద్ధ్యంలో జిల్లాలోనే ఆదర్శంగా ఉంది. సుమారు 58 ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తి అయ్యింది. మరో 100వరకు ప్రగతిలో ఉన్నాయి. స్మశాన వాటిక నిర్మాణం, దోభీఘాట్, పశువుల తొట్టె, స్నానాల గట్టం, డంపింగ్ యార్డ్, మినరల్ వాటర్ ప్లాంట్, ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గతేడాది జాతీయ గ్రామీణ నిర్మల్ పురస్కార్ అవార్డ్కు ప్రతిపాదనలు పంపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్యక్షతన గతేడాది అక్టోబర్ 11న అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించిన జాతీయ సమ్మేళనానికి ఆదివారంపేట సర్పంచ్ మైదం కుమార్కు ఆహ్వానం అందగా పాల్గొన్నారు. పథకాలు ఆన్లైన్... ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలును గ్రామంలో సమర్థ్ధవంతంగా నిర్వర్తించారు. ఎప్పటికప్పుడు ఆయా పథకాల అమలు తీరును ఆన్లైన్ చేయయడంలో జిల్లాలోనే ఆదివారంపేట సర్పంచ్ మందజలో ఉన్నారు. దీంతో అధికారులు జాతీయ సమ్మేళనానికి ఎంపిక చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ..శభాష్ అనిపించుకుంటున్నారు. గ్రామస్తుల సహకారంతో.. గ్రామస్తుల సహకారంతోనే గ్రామాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగింది. గ్రామస్తులు ప్రోత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దీంతో ఆదివారంపేట జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైయ్యింది.– మైదం కుమార్,సర్పంచ్ ఆదివారంపేట అన్నిరంగాల్లో ఆదర్శం పరిసరాల పరిశుభ్రత, సంపూర్ణ పారిశుద్ధ్యంలోనే కాదు అభివృద్ధిలోను ఆదివారంపేట ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో ప్రజల మౌలిక అవసరాలకు అనుకూలంగా అన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక కావడం గ్రామస్తుల అదృష్టం.– కలవేన సదానందం, స్థానికుడు ప్రొఫైల్ జనాభా: 1964 మహిళలు: 957 పురుషులు: 1007 ఇళ్లు: 567 మరుగుదొడ్లు: 100శాతం సీసీ రోడ్లు: 100శాతం అంగన్వాడీ కేంద్రాలు: 2 ప్రభుత్వ పాఠశాలలు: 1 -
గోదావరి నదిలో పడవ బోల్తా
నలుగురు గల్లంతు ♦ బోట్ సిబ్బంది సహా 22 మంది సురక్షితం ♦ మహారాష్ట్ర-తెలంగాణ అంతర్రాష్ట్ర వంతెనవద్ద ప్రమాదం కాళేశ్వరం: కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం మెట్పల్లి వద్ద నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర వంతెన వద్ద పర్యాటక స్టీమర్(పడవ) బోల్తా పడి నలుగురు గల్లంతయ్యారు. 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చింతలపల్లి మహదేవపూర్ మండలం మెట్పల్లిని కలుపుతూ గోదావరి నదిపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన పనుల కోసం తాత్కాలికంగా రహదారి కూడా నిర్మించారు. గోదావరికి అటూ ఇటూ ఉన్న గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి తాత్కాలిక రహదారిపైనుంచి గోదావరి దాటుతుంటారు. ఇటీవల గోదావరికి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వంతెన పనులు చేసే నిర్వాహకులు... ఆదివారం తాత్కాలిక రహదారివైపు నీళ్లు రాకుండా కాలువలా చేసి నీటిని మళ్లించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరిపై పడవ ద్వారా ప్రయాణికులను అటూ ఇటూ చేరవేసే గంగపుత్రులు ఆదివారం ఈ తాత్కాలిక వంతెన వద్ద ప్రయాణికులను చేరవేసేందుకు వచ్చారు. సాయంత్రం 20 మంది ప్రయాణికులు, పడవ నడిపేవారు ఆరుగురితో కలిపి మొత్తం 26 మందితో వంతెన వద్ద నుంచి మెట్పల్లికి పడవలో బయలుదేరారు. వంతెన కింది భాగంలో వెల్డింగ్ పనులు నడుస్తుండడంతో జనరేటర్ వైర్ నీటిలో పడవకు అడ్డు తగిలింది. దీంతో పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్నవారంతా నీళ్లలో పడిపోయారు. మూడు బైక్లు సైతం మునిగిపోయాయి. గంగపుత్రులు వెంటనే నీళ్లలో దూకి పలువురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. క్షేమంగా బయటపడ్డవారిలో మాలే విష్ణు (సిరొంచా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వ్యక్తి), ఆలం కాజల్, శ్రీరాం పార్వతి (సిరొంచా), నేలటూరి భాగ్య (పరకాల), ధర్మపురి నరేష్, అతడి భార్య అలేఖ్య (నిండుగర్భిణి), శశికళ, అరుణ్ (జగిత్యాల), మతిన్ (సిరొంచా), ఊదరి వినయ్, ఊదరి సమ్మక్క దంపతులు, వీరి కుమారుడు చరణ్ (6), మారగోని జ్యోతి, ఆమె బావ కూతురు శ్రేయశ్రీ (5) (ఆసరెళ్లి), బుర్రి లక్ష్మి ఆమె పది నెలల కూతురు ఉన్నారు. పాప అస్వస్థతకు గురికావడంతో గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాటారం మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుర్రి వంశీ (11) గల్లంతయ్యాడని అతడి బంధువులు తెలిపారు. వంశీతోపాటు మరో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సిరొంచా డీఎస్పీ శివాజీ పవార్, మంథని ఆర్డీవో బాలె శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రవి, ఎస్సైలు కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.