ప్రధాన మంత్రి అవార్డు రేసులో విశాఖ | Visakhapatnam Shortlisted For PM Award 2020 By Swachh Bharat | Sakshi
Sakshi News home page

ప్రధాన మంత్రి అవార్డు రేసులో విశాఖ

Published Thu, Sep 17 2020 9:16 AM | Last Updated on Thu, Sep 17 2020 9:29 AM

Visakhapatnam Shortlisted For PM Award 2020  By Swachh Bharat  - Sakshi

సాక్షి , విశాఖపట్నం : స్వచ్ఛతలో మెరిసి మురిసిపోతున్న మహా విశాఖ నగరం.. మరో ముందడుగు వేసింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు–2020కి ఎంపికైన 10 జిల్లాల జాబితాలో విశాఖ చోటు దక్కించుకుంది. జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలు(యూఎల్‌బీలు) కలిపి ఒక క్లస్టర్‌గా పోటీల్లో పాల్గొన్న విశాఖ.. దక్షిణాది రాష్ట్రాల తరఫున ఎంపికైన ఏకైక జిల్లాగా నిలిచింది.స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ ఏడాది ఏకంగా 14 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచి టాప్‌–10లో విశాఖ నగరం చోటు సంపాదించుకుంది. చెత్త రహిత నగరంగా.. తడిపొడి చెత్త విభజన, చెత్త నుంచి ఎరువు తయారీలోనూ ఇటీవలే ప్రశంసలందుకున్న విశాఖ.. ఇప్పుడు మరో అవార్డు కోసం రేసులో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్‌(ఎస్‌బీఎం)లో ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో ప్రధాన మంత్రి అవార్డు కోసం విశాఖపట్నం దేశంలోని తొలి పది యూఎల్‌బీ క్లస్టర్ల జాబితాలో నిలిచింది. ఈసారి కేవలం విశాఖ నగరం మాత్రమే కాకుండా.. జిల్లాలోని యూఎల్‌బీలన్నీ కలిపి క్లస్టర్‌గా ఏర్పడి ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది. 

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చెత్త విభజన, స్థానిక సంస్థలు అందించే సేవలు, కార్యక్రమాలపై అవగాహన, సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మొదలైన అంశాల్లో ప్రజల్లో అవగాహన ఎలా ఉందనే అంశాలపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు.  జీవీఎంసీతో పాటు నర్సీపట్నం, యలమంచిలి జీవీఎంసీతో పాటు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు కలిపి జిల్లా యూఎల్‌బీ క్లస్టర్‌గా ఏర్పడింది. ఆయా రాష్ట్రాల్లోని ఎంపికైన ప్రతి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఈ అవార్డు కోసం పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా తొలి పది జిల్లాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ అవార్డుకి సంబంధించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులకు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి వి.వినయ్‌చంద్‌ ఆన్‌లైన్‌లో వివరించారు. జిల్లా యూఎల్‌బీల్లో స్వచ్ఛభారత్‌ విషయంలో ఎలాంటి ప్రగతి సాధించిందనే అంశాలను వెల్లడించారు.  
దక్షిణాది నుంచి ఏకైక జిల్లా.. 
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి 10 జిల్లాలు ప్రధాన మంత్రి అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. ప్రమోటింగ్‌ పీపుల్స్‌ మూమెంట్‌– జన భగీరధి పేరుతో ఈ అవార్డు అందించనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి దుర్గ్, సుర్గుజా, రాయ్‌ఘర్, రాజ్‌నంద్‌గావూన్‌ జిల్లాలు, గుజరాత్‌ నుంచి సూరత్, అహ్మదాబాద్, రాజ్‌కోట్, మధ్యప్రదేశ్‌ నుంచి ఇండోర్, మహారాష్ట్ర నుంచి ధూలే జిల్లాలు బరిలో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది మాత్రం కేవలం విశాఖ జిల్లా మాత్రమే. 

ప్రజల భాగస్వామ్యమే నిలబెట్టింది.. 
ప్రధాన మంత్రి అవార్డు కోసం జిల్లా యూఎల్‌బీ యూనిట్‌ పోటీ పడుతోంది. దీనికి సంబంధించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ పీఎం కార్యాలయానికి, స్వచ్ఛభారత్‌ మిషన్‌ అధికారులకు వివరించాం. ఎస్‌బీఎం బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో విశాఖ ప్రజలు నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ భాగస్వాములు కావడం వల్లే టాప్‌–10లో స్థానం సంపాదించుకోగలిగాం. 29,016 స్వయం సహాయక బృందాల్లోని 3,38,511 మంది మహిళలు చెత్త విభజన చేస్తూ ఇంట్లో ఎరువు తయారు చేస్తుండటం రికార్డుగా చెప్పుకోవచ్చు. 
–వి.వినయ్‌చంద్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి 

ఈ నెలాఖరులో ఫలితాలు.. 
స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యంతో పాటు స్వచ్ఛ అంబాసిడర్లు, నౌకాదళం, నాయకులు, పరిశ్రమలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు అందిస్తున్న సహకారం వల్లే.. విశాఖ పోటీలో నిలిచింది. జీవీఎంసీ కమిషనర్‌ నేతృత్వంలో ప్రజారోగ్య విభాగం అందిస్తున్న సేవలతో నగరం సర్వేక్షణ్‌లో 9వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో తొలిసారిగా యూజర్‌ ఫ్రెండ్లీ టాయిలెట్లు ఏర్పాటు చేసింది విశాఖ నగరంలోనే. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్‌ తయారీ, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విషయంలోనూ ముందంజలో ఉన్నాం. పీఎం అవార్డు ఫలితాలు ఈ నెలాఖరులో వెల్లడి కానున్నాయి. 
– డా. వి.సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్, స్వచ్ఛ సర్వేక్షణ్‌ నోడల్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement