ఒట్టు.. వెదికినా దొరకదు టాయ్‌లెట్టు | Hyderabad's Public Toilets Reek With Dirt And Lack Of Water Supply | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటీ ఆడక్కు!

Published Mon, Dec 11 2017 9:35 AM | Last Updated on Mon, Dec 11 2017 9:35 AM

Hyderabad's Public Toilets Reek With Dirt And Lack Of Water Supply - Sakshi

ఇది మహానగరం బాస్‌.. ఆకాశాన్నంటే మేడలుంటాయ్‌.. అద్భుతాల జాడలుంటాయ్‌.. హైటెక్‌ రోడ్లుంటాయ్‌.. రాత్రికి, పగలుకు తేడా తెలియని విద్యుత్‌ వెలుగులుంటాయ్‌.. అడుగడుగునా జనం.. వారి అవసరాలు తీర్చుకోవడానికి ఒక్క మరుగుదొడ్డీ కనిపించదు. రోడ్డుపై కాలు కదపలేనంతగా వాహనాల తోరణాలు.. చేసేది లేక ఆ పక్కనే కడుపు ఉబ్బరం తీర్చుకునే వారు.. ఏం చేస్తారు పాపం.. కంపును ఇంపుగా భావించి పని కానిస్తారు. ఎందుకంటే ఇది మహానగరం.. ఎల్‌బీనగర్‌ నుంచి పటాన్‌చెరు వరకు.. కుత్బుల్లాపూర్‌ నుంచి గచ్చిబౌలి వరకు.. భూతద్దం పెట్టి వెదికినా ఒక్క పబ్లిక్‌ టాయ్‌లెట్టూ కనిపించదు. ఇక్కడే రాష్ట్రాన్ని పాలించే నేతలుంటారు.. శాసనాలు చేసే మేధావులుంటారు.. ప్రజా అవసరాలు తీర్చే అధికారులుంటారు.. వారెవరికీ సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకునే తీరిక లేదు. వారంతా అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు వ్యూహాలు రచిస్తుంటారు.

ఐటీలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించే పనిలో ఉంటారు.. సామాన్య ప్రజల కోసం రోడ్డు పక్కన టాయ్‌లెట్లు కట్టాలనే చిన్న ఆలోచనే రాదు. కోటి మంది జనాభా అవసరాలు తీర్చేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉంది. సిటీని అద్భుతంగా మార్చే యంత్రాంగం ఉంది. ‘స్వచ్ఛ హైదరాబాద్‌’ కోసం రేయింబవళ్లు తపన పడుతుంటుంది. నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే శిక్ష తప్పదంటుంది. అడుగడుగునా అందమైన టాయ్‌లెట్లు కట్టామంటుంది. కోటిమందికి 382 మూత్రశాలలు అందుబాటులో ఉన్నాయంటుంది. ఎక్కడున్నాయంటే కాగితంపై లెక్కలు చూపిస్తారు. ఎన్ని వినియోగంలో ఉన్నాయంటే మాత్రం సమాధానం ఉండదు. ప్రస్తుతం సిటీలో ఐదు కిలో మీటర్లకు ఒక్క టాయ్‌లెట్టూ కనిపించదు. ఉన్నవాటిలోకి వెళితే.. ముక్కు పగిలే కంపుతో కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. మరి సామాన్యుడి కనీస కష్టం తీర్చుకునేదెలా..! రాష్ట్ర అభివృద్ధి కోసం ఏటా లక్షన్నర కోట్ల బడ్జెట్‌ ప్రవేశ పెట్టే నేతలు.. అందులో పైసా వంతు విదిల్చితే చాలు.. రాష్ట్ర రాజధాని నగరంలో వేలాది పబ్లిక్‌ టాయ్‌లెట్లు నిర్మించవచ్చు. సామాన్యుల కష్టాలు తీర్చవచ్చు.

సాక్షి, సిటీబ్యూరో/నెట్‌వర్క్‌: సైదాబాద్‌ నుంచి బంజారాహిల్స్‌కు బైక్‌పై బయల్దేరిన రాజేశ్‌కు చంచల్‌గూడ దాటాక టాయ్‌లెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కనుచూపు మేరలో ఎక్కడా కనబడలేదు. బంజారాహిల్స్‌ చేరేంతవరకు ఎక్కడైనా కనబడతాయేమోనని రోడ్డు పక్కన వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తృటిలో ఒక యాక్సిడెంట్‌ తప్పింది.

...ఈ పరిస్థితి ఒక్క రాజేశ్‌దే కాదు. నగరంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారు ఎందరో ఎదుర్కొంటున్న సమస్య ఇది. జీహెచ్‌ఎంసీ జనాభా దాదాపు కోటి దాటగా, నగర ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారితో సహ ప్రతిరోజూ దాదాపు 15 లక్షల మంది రోడ్లపై ప్రయాణిస్తున్నారు. వీరికి సరిపడా పబ్లిక్‌ టాయ్‌లెట్లు లేక అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ పబ్లిక్‌ టాయ్లెట్లు కనిపించక అల్లాడుతున్నారు. గంటలకొద్దీ ఉగ్గబట్టుకుంటుండంతో మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. మహిళల పరిస్థితి మరింత దుర్భరం. షీ టాయ్‌లెట్లంటూ ఇటీవల కొన్నిప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేసినా అవి ఏమూలకూ చాలడం లేవు. ఉన్నవాటిల్లో యాభై శాతం వరకు నిర్వహణ లోపంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో కొందరు, యూజర్‌ ఛార్జీలు చెల్లించలేక మరి కొందరు బహిరంగ విసర్జనకు పాల్పడుతున్నారు. జీహెచ్‌ఎంసీలో ఉన్న 1450 పబ్లిక్‌ టాయ్‌లెట్ల యూనిట్లతోపాటు, హోటళ్లు, పెట్రోలు బంకుల వారిని ఒప్పించి మరో 500 పైగా పబ్లిక్‌ టాయ్‌లెట్లను ప్రజలు వినియోగించుకునేలా అందుబాటులోకి తెచ్చామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. హోటళ్లు, పెట్రోలు బంకుల్లోని వాటిని ఉచితంగానే వినియోగించుకునే ఏర్పాట్లు చేశామంటోంది. అయితే వాటిని వినియోగించుకోవచ్చుననే   బోర్డులు లేకపోవడంతో ప్రజలకు తెలియడం లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ మల, మూత్ర విసర్జనలతో నగరం అధ్వాన్నంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫీల్డ్‌ విజిట్‌ నిర్వహించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అర కిలోమీటర్‌కో యూరినల్స్‌ ఎక్కడ ?  
స్వచ్ఛభారత్‌ మిషన్‌ మార్గదర్శకాల మేరకు ప్రతి అర కిలోమీటరుకు యూరినల్స్, కిలోమీటర్‌కు మరుగుదొడ్లు ఉండాలి. కానీ నగరంలో ఏ ఒక్క మార్గంలోనూ ఈమేరకు లేవు. ఎల్‌బీనగర్‌ నుంచి గచ్చిబౌలి వరకు, కోఠి నుంచి మియాపూర్‌ వరకు, మల్కాజిగిరి నుంచి చార్మినార్‌ వరకు మార్గదర్శకాల కనుగుణంగా లేవు. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా ఒక్క టాయ్‌లెట్‌ కూడా లేని మార్గాలెన్నో.  
సైదాబాద్‌ నుంచి బంజారాహిల్స్‌కు  12 కి.మీ.ల దూరం ఉండగా,  చంచల్‌గూడ జైలు వద్ద తప్ప మరెక్కడా పబ్లిక్‌ టాయ్‌లెట్లు లేవు.  
సాగర్‌ రింగ్‌రోడ్డు నుంచి బంజారాహిల్స్‌కు వచ్చేవారికి చంపాపేట, కోఠిలో తప్ప మరెక్కడా పబ్లిక్‌ టాయ్‌లెట్లు లేవు.  
చాదర్‌ఘాట్‌ నుంచి చైతన్యపురి వరకు లేవు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కోఠివైపు వచ్చేవారికి మూసారంబాగ్, మలక్‌పేటల్లో మాత్రం ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో లేవు.  
ఐడీపీఎల్‌వద్ద పబ్లిక్‌ టాయ్‌లెట్‌లోకి ప్రజలు వెళ్లడానికి వీల్లేకుండా ఆటోలు అడ్డు ఉంటున్నాయి.  
రాయదుర్గం నుంచి గోపన్‌పల్లి వరకు, రాయదుర్గం నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు ఉన్న పది పెట్రోల్‌బంకుల్లో  ‘జీహెచ్‌ఎంసీ టాయ్‌లెట్లు’ అని ఉన్నప్పటికీ, ఎక్కడా టాయ్‌లెట్లను ఉచితంగా వినియోగించుకోవచ్చునని బోర్డులు లేవు.
కూకట్‌పల్లిలో పెట్రోల్‌ బంకుల్లో ఉచిత మూత్రశాలలు ఎక్కడా లేవు. సిబ్బందికోసం ఏర్పాటు చేసినివి సైతం ప్రజలకు కనిపించడం లేదు.  
టోలిచౌకి చౌరస్తా వద్ద మూడు ప్రధాన బస్టాపులున్నాయి. మెహదీపట్నం, గచ్చిబౌలి, గండిపేట వైపు వెళ్లే బస్సుల్లో ప్రతి గంటకు వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. ఇంత రద్దీ ప్రాంతంలో  ఎలాంటి టాయ్‌లెట్లు లేవు. గోల్కొండ, టోలిచౌకి, షేక్‌పేటల వద్ద ఒక్క షీటాయ్‌లెట్‌ కూడా లేకపోవడంతో మహిళలు అవస్థలు వర్ణనాతీతం.
కుత్బుల్లాపూర్‌ పరిధిలోని 14 పెట్రోల్‌ బంకుల్లో స్వచ్ఛ టాయ్‌లెట్లు ఏర్పాటు చేసినప్పటికీ, రెండు చోట్ల తప్ప మిగతా ప్రాంతాల్లో నిర్వహణ లేక ప్రజలు వినియోగించుకోవడం లేదు.
రాయదుర్గం, సైబరాబాద్‌ కమిషనరేట్, అంజయ్యనగర్, సుదర్శన్‌నగర్‌లలో స్వచ్ఛ టాయ్‌లెట్లు ఏర్పాటు చేసినప్పటికీ కొద్దిరోజులకే వాటిని తొలగించారు.  
హిమాయత్‌నగర్‌ ప్రధాన రహదారిలో ఒక్క టాయ్‌లెట్‌ కూడా లేదు.
నారాయణగూడ, బషీర్‌బాగ్, కింగ్‌కోఠి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులతో సహ లక్షల మంది  రాకపోకలు సాగిస్తుంటారు.వీరందరికీ ఇక్కడ ఉన్న రెండు పబ్లిక్‌ టాయ్‌లెట్లే దిక్కు
ఉప్పల్‌లో స్వచ్ఛ టాయ్‌లెట్లు ఉన్నప్పటికీ డబ్బులు ఇవ్వలేక గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రోడ్లపైనే మూత్రవిసర్జన చేస్తున్నారు.
కాప్రా సర్కిల్‌లోని 20 హోటళ్లు, 12 పెట్రోలు బంకుల్లో ఎక్కడా ఉచిత సదుపాయం అనే సూచికలు లేవు.  
కుషాయిగూడలో హోటళ్లు, పెట్రోలు బంకుల వద్ద టాయ్‌లెట్లను ఉపయోగించుకోవచ్చునని బోర్డులు ఏర్పాటు చేసి,  కొద్దిరోజులకే తొలించారు.  
పాతబస్తీలోని చాంద్రాయణగుట్టనుంచి నయాపూల్‌ వరకు 16 పెట్రోల్‌బంకులుండగా,  నాలుగు చోట్ల బోర్డులున్నాయి.
ఎర్రగడ్డనుంచి అమీర్‌పేట వరకు ప్యారడైజ్‌ నుంచి బేగంపేట్‌  వరుణ్‌మోటార్స్‌ వరకు ఎలాంటి టాయ్లెట్లు లేవు. ఈ ప్రాంతంలోని ఆయా రహదారుల్లో ఏడు పెట్రోల్‌బంకులు, 30 హోటళ్లలో ఏఒక్క దాంట్లోనూ  ఉచిత  సదుపాయం ఉన్నట్లు బోర్డులు లేవు. ఒక వేళ వెళ్దామనుకున్నా సిబ్బంది అడ్డుపడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.  
నేరేడ్‌మెట్‌ చౌరస్తా నుంచి ఈసీఐఎల్‌ రహదారి, ఆర్‌కేపురం రహదారి, మల్కాజిగిరి నుంచి వాజ్‌పేయి నగర్‌ వరకు పబ్లిక్‌ టాయ్‌లెట్లు లేవు.

షేక్‌పేట్‌ నాలా వద్ద ఫుట్‌పాత్‌ పై పని కానిస్తున్న దృశ్యం  
నిర్వహణ లోపం..దుర్గంధ భరితం..
పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్వహణను ప్రైవేటుకిచ్చిన జీహెచ్‌ఎంసీ వాటిని తనిఖీలు చేయకపోవడంతో చాలా చోట్ల కనీస సదుపాయాలు లేక, దుర్గంధంతో, వినియోగానికి వీల్లేకుండా ఉన్నాయి. తక్కువ రద్దీ ప్రాంతాల్లో నిర్వహణకు ముందుకొచ్చే వారు కూడా లేకపోవడంతో మూతపడుతున్నాయి.

జరిమానాల కొరడా..!
పరిస్థితులిలా ఉండగా,  బహిరంగ మూత్ర విసర్జన చేస్తే జరిమానాలు విధించనున్నట్లు జీహెచ్‌ఎంసీ మరోమారు హెచ్చరించింది. బహిరంగ మల,మూత్ర విసర్జన ప్రదేశాలు(ఓడీఎఫ్‌)గా దాదాపు 1800 ప్రాంతాల్ని ప్రకటించిన జీహెచ్‌ఎంసీ, ఆమేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి సర్టిఫికేషన్‌ కోసం ఈ చర్యలకు సిద్ధమైంది. ఇక  పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్వహణపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రతి టాయ్‌లెట్‌ వద్ద ప్రత్యేకంగా ఫీడ్‌ బ్యాక్‌ బటన్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో ప్రకటించారు. కానీ ఎక్కడా పెట్టిన దాఖలాలు లేవు.

ముంబైలో అంతస్తుల్లో ..
ముంబై నగర జనాభా దాదాపు  2.30 కోట్లు  ముంబైలో ప్రస్తుతం 11,170 పబ్లిక్‌ టాయ్‌లెట్లున్నాయి. బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వచ్చే సంవత్సరం వీటి సంఖ్యను 18,818కి పెంచేందుకు సిద్ధమైంది.  ఇందుకుగాను దాదాపు రూ. 376 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్థలాభావంతో రెండు, మూడు అంతస్తుల్లో వీటిని నిర్మించాలని ప్రతిపాదించారు.

మొత్తం 307 పబ్లిక్‌ టాయ్‌లెట్లలో 1450 యూనిట్లున్నాయి.  
వీటిల్లో యూరినల్స్‌కు రూ.2, మరుగుదొడ్లకు రూ. 5 నుంచి రూ. 7 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.
సౌత్‌జోన్‌ పరిధిలోకి వచ్చే  పాతబస్తీ కేవలం 25 పబ్లిక్‌ టాయ్‌లెట్లే ఉన్నాయి.  
పెట్రోలు బంకులు : 469
టాయ్‌లెట్ల వినియోగానికి అంగీకరించినవి: 259
టాయ్‌లెట్‌ సదుపాయాలున్న హోటళ్లు : 900
వినియోగానికి అంగీకరించినవి :257 +

ఆయా నగరాల జనాభా, పబ్లిక్‌ టాయ్‌లెట్ల యూనిట్లు  దాదాపుగా..
ఢిల్లీ జనాభా : 2.70 కోట్లు
పబ్లిక్‌ టాయ్‌లెట్లు :  5776
ముంబై జనాభా : 2.30  కోట్లు
పబ్లిక్‌ టాయ్‌లెట్లు : 11,170
చెన్నయ్‌ జనాభా: 1.01 లక్షలు
పబ్లిక్‌ టాయ్‌లెట్లు: 900
హైదరాబాద్‌ జనాభా: 1.02 కోట్లు  
పబ్లిక్‌ టాయ్‌లెట్లు : 1450  

ప్రజల్లో పరివర్తన రావాలి
పబ్లిక్‌ టాయ్‌లెట్లు లేనందునే బహిరంగ మూత్ర విసర్జన అనేది ఒక సాకు మాత్రమే. చాలా చోట్ల ఉన్న వాటిని వినియోగించుకోవడం లేదు. ప్రజల్లో మార్పు రానంత వరకు ఏమీ చేయలేం. కొందరి చేష్టల వల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నవాటిని వినియోగించుకోకుండా నిందలు వేయడం తగదు. పెట్రోలు బంకులు, హోటళ్ల వారిని ఒప్పించి టాయ్‌లెట్లను వినియోగించుకునే అవకాశం కల్పించాం. టాయ్‌లెట్ల అటెండెంట్లు శుభ్రంగా ఉండేందుకు దాదాపు 600 మందికి రెండు జతల తెల్లని దుస్తులు, టోపీ, బూట్లను సీఎస్సార్‌ ద్వారా పంపిణీ చేశాం. నిర్వహణపై శ్రద్ధ తీసుకుంటూ, తనిఖీలు నిర్వహిస్తున్నాం. యూజర్‌చార్జీలు చెల్లించలేని వారి కోసం విరాళాలిచ్చే వారిని ఆహ్వానిస్తున్నాం. తద్వారా ఉచిత సదుపాయం కల్పిస్తున్నాం.   – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement