సాక్షి, ముంబై : పరిశుభ్ర భారతావనినే జాతి పిత బాపుజీ కలలు కన్నదని చెబుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాంది పలికిన విషయం తెలిసిందే. 2019లో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ సాధనతో ఉత్తమ నివాళి అందించాలని మోదీ కోరారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలకు కూడా ఆయన స్వచ్ఛతా హీ సేవా పిలుపునిచ్చారు.
ఇప్పటికే మద్ధతు తెలిపిన లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చీపురు పట్టేశారు. మంగళవారం ఉదయం ముంబై పశ్చిమ బాంద్రాలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మనం బాగుంటామని ఈ సందర్భంగా సచిన్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని మాస్టర్ బ్లాస్టర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం గాంధీ జయంతి(అక్టోబర్ 2) వరకు కొనసాగుతుంది. ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని మోదీ లేఖలు రాసిన విషయం తెలిసిందే. మళయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, అనుష్క శర్మ, దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తమ మద్ధతును ప్రకటించారు.