లేనిది ఉన్నట్టు... అంతా కనికట్టు... | corruption in toilets constructions | Sakshi

లేనిది ఉన్నట్టు... అంతా కనికట్టు...

Published Tue, Feb 13 2018 1:10 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

corruption in toilets constructions - Sakshi

కట్టని ఇంటికిగొయ్యితవ్వి నందలువేసిన వైనం, చనిపోయిన ఎర్రబంగారమ్మ పేరిట నిధులు డ్రా చేసిన మరుగుదొడ్డి

ఒకే ఇంట్లో నిర్మించిన మరుగుదొడ్డికి ముగ్గురి పేర్లతో బిల్లులు కాజేశారు. తాత్కాలికంగా గుడ్డతో కట్టుకున్న దొడ్డి ఉంటే దానికి డబ్బులు గుంజేశారు. చనిపోయినవారి పేర్లను చేర్చి వారి పేరున స్వాహా చేశారు. ఇదీ కొత్తవలస మండలం చినరావుపల్లిలో జరిగిన బిల్లుల మాయాజాలం.

కొత్తవలసరూరల్‌(శృంగవరపుకోట): స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఓ వైపు జిల్లా కలెక్టర్‌ ఓ ఉద్యమంలా కార్యక్రమాలు చేపడుతుంటే అందులోనూ కాసులు కాజేసేవారు పుట్టుకొస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయడానికి తప్పుడు లెక్కలతో బిల్లులు కాజేసేశారు. ఈ స్కాం వెనుక మండలానికి చెంది న ఓ అ«ధికారి టీడీపీ ప్రతినిధుల అండదండలతో ఉన్నట్టు తెలుస్తోంది. మండలంలోని చినరావుపల్లిలో జరిగిన బిల్లులే అక్రమాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి.

40శాతానికి పైగా బిల్లులు స్వాహా
చినరావుపల్లిలో చనిపోయినవారి పేరిట చెల్లింపు, అస్సలు నిర్మాణాలే లేకుండా డ్రా చేయడం, అసంపూర్తిగా వదిలేసిన వాటికీ, ఒకే నిర్మాణంతో ముగ్గురికి బిల్లులు చెల్లించిన సంఘటనలు వెలుగు చూశాయి. గ్రామంలో 182 మరుగుదొడ్లు నిర్మించినట్టు బిల్లులు తీసేసుకున్నా... 40 శాతానికి పైగా బిల్లులు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. గ్రామానికి చెందిన సింగంపల్లి వాసు, బూసాల వెంకటరమణతో పాటు గ్రామంలోగల తెలుగు తమ్ముళ్లు  తదితరులు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో 182 మంది లబ్దిదారులను ఓడీఎఫ్‌కు ఎంపికచేసి దాదాపు రూ. 27 లక్షలు మంజూరు చేశారు. అందులో ఎన్‌జీఓ అకౌంట్‌లో రూ. 24 లక్షలు, వెలుగు సీసీ వీఓ అకౌంట్‌లో 2 లక్షలు, లబ్ధిదారుల అకౌంట్‌లో సుమారు 84 వేలు చేరింది. పనులు పర్యవేక్షించాల్సిన కార్యదర్శి మరో గ్రామం బాధ్యతలు చూస్తున్నందున దీనిపై దృష్టిసారించలేకపోయారు. ఉపాధి టీఏ సూర్యకుమారి జియోట్యాగింగ్‌ వంటి పనులు చూశారు. అయితే అనుమానం వచ్చి ఆమె అభ్యంతర పెట్టినా కొందరి ఒత్తిళ్లతో తలూపక తప్పలేదు.

రకరకాలుగా అక్రమాలు
∙గ్రామానికి చెందిన కొయ్యాన లక్ష్మి, కొయ్యాన కొండమ్మ, కొయ్యాన గౌరి ఒకే కుటుంబంగా నివసిస్తున్నారు. ఇక్కడ ఒకే మరుగుదొడ్డి నిర్మించినప్పటికీ వీరి ముగ్గురి పేరిట మూడు బిల్లులుగా రూ. 45 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించేశారు.  ∙గంధం సరళ అనే ఆమె కేవలం ఒక గుడ్డమాత్రమే కట్టుకుని మరుగుకు వినియోగిస్తున్నారు. ఈమెకు తెలీకుండానే బిల్లు చెల్లించినట్టు నమోదైంది.
∙అడ్డాల లక్ష్మికి అసలు ఇల్లే లేదు. అయినా లెక్కకోసం నందలు తీసి వదిలేశారు. ∙చనిపోయిన యర్ర బంగా రమ్మ పేరిట నిర్మించిన బాత్‌రూంను అసంపూర్తిగా వదిలే సి లబ్ధిదారునికి చేరాల్సిన బిల్లులు పక్కదారి పట్టించేశారు.

కంప్యూటర్‌ మాయాజాలం
గ్రామంలో జరిగిన బిల్లు చెల్లింపుల వ్యవహారంలో సాంకేతిక మాయాజాలం కూడా వెలుగు చూసింది. బాత్‌రూం ఐడీ 30311073 కొయ్యానగౌరి అని నమోదైతే రేషన్‌ కార్డు కొయ్యాన అచ్చుతరావుగా చూపుతోంది. లబ్ధిదారుల జాబితాకు రేషన్‌కార్డులకు అసలు పొంతన ఉండట్లేదు.

మరుగుదొడ్డి నిర్మించకుండానే తినేశారు
మా ఇంటికి మరుగు లేదు. గుడ్డ కట్టుకుని మరుగుగా వాడుకుంటున్నాం. నుయ్యి పక్కనే బాత్‌ రూం కడతామంటే వద్దన్నాం. వేరే దగ్గర కట్టుకుంటామని తెలిపాం. మాకు తెలీకుండానే మరుగు కట్టినట్లు రూ. 15 వేలు నిధులు తినేశారు. – గంధం సరళ కుమార్తె

మూడువేలు తీసుకున్నారు
మేము కట్టుకున్న మరుగుకు 15వేలు మంజూరయ్యారన్నారు. రూ. 12వేలే ఇచ్చారు. మిగతా మొత్తంకోసం జన్మభూమి సభలో అధికారుల్ని నిలదీసినా ఫలితం లేకపోయింది. పైగా ఖర్చులు ఉంటాయంటున్నారు.   – కర్రి పార్వతి

అసలు లిస్టే నాకు తెలీదు
గ్రామంలో ఎన్ని  మరగుదొడ్లు నిర్మించారో ఎంతమందికి బిల్లులు ఇచ్చారో ఆ లిస్టే నాకు తెలీదు. అధికారులు ఎలా చెయ్యమంటే అలాచేశాను. కొన్ని నిర్మాణాలు పూర్తికాక, ప్రభుత్వం నుంచి బిల్లులు రావటం ఆలస్యమైంది.  గ్రామంలో కొంతమంది వీధికుళాయిల వద్ద వచ్చిన చిన్నగొడవతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా సొంత డబ్బులు చెల్లించి మరీ నిర్మాణాలు చేపడుతున్నాను.
          – బొబ్బిలి రమణ, సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement