మార్కెట్‌లో కల్తీ జోరు..
-
పండుగపూట ప్రజలకు అంటగడుతున్న వైనం
-
పెరుగుతున్న అక్రమ రవాణా దందా
-
కానరాని అధికారుల పర్యవేక్షణ
కోల్‌సిటీ : పండుగ పూట మార్కెట్‌లో కల్తీ సరుకుల అమ్మకాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు విచ్చలవిడిగా నాణ్యత లేని సరుకులు తెప్పించి ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నియంత్రించాల్సిన ‘మామూలు’గానే భావిస్తున్నారు.
నగరం అడ్డా...
గోదావరిఖని నగరం కల్తీ నిత్యావసర ఆహార వస్తువులు విక్రయించడానికి అడ్డాగా మారింది. వే–బిల్లులు లేకుండా నకిలీ, కల్తీ సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి గోదావరిఖనికి దిగుమతి చేస్తున్నారు. స్థానికంగా ఉండే కొన్ని కిరాణం, జనరల్ స్టోర్స్‌ల్లో కల్తీ సరుకులను బహిరంగంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు నకిలీ సరుకులను భారీ మొత్తంలో అక్రమంగా దిగుమతి చేస్తున్నారు. కంపెనీ చిరునామా కూడా లేని వంట నూనెను డ్రమ్ముల్లో బహిరంగంగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నూనెను ఇతర కంపెనీ డబ్బాల్లో నింపుతూ జనానికి అంటగడుతున్నారు.
అంతా కల్తీయేనా...?
బియ్యంలో నాసిరకం బియ్యం, కంది పప్పులో కేసరిపప్పు, వంట నూనెలో పత్తి, సోయా, పామాయిల్, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె కలిపి కల్తీ చేస్తున్నారు. కారం, ఉప్పు, చాయపత్తి, మిరియాలు, జిలకర, శనిగపప్పుల్లో కూడా కల్తీ జరుగుతోంది. అసలు ఎందులో కల్తీ జరిగిందో కూడా వినియోగదారులు కనిపెట్టలేని విధంగా కల్తీ జరుగుతోంది.
బోర్డుల్లేని విక్రయ షాపులు...
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక కిరాణ, జనరల్ స్టోర్లకు పేర్లు కూడా లేకుండానే నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కల్తీ సరుకుల విక్రయాలపై, బోర్డులు లేకుండా ఏళ్ల తరబడి అక్రమంగా నిర్వహిస్తున్న వ్యాపారులపై అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. గుట్టుచప్పుడు కాకుండా తనిఖీలు చేస్తున్న సంబంధిత అధికారులు, వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ సరుకులతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మరోవైపు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ విక్రయాలు జరుపుతున్న వ్యాపారులు, కల్తీ సరుకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.