చిన్న పిల్లలే... టార్గెట్‌..! | Adulteration In Children Snacks In Krishna | Sakshi
Sakshi News home page

తినుబండారాల కల్తీ గుట్టురట్టు

Published Tue, Aug 14 2018 12:32 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

Adulteration In Children Snacks In Krishna - Sakshi

తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రాజ్‌కుమార్, ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి పూర్ణచంద్రరావు

చిన్న పిల్లలు ఇష్టంగా తినే కుర్‌కురే వంటి పదార్ధం, పాప్‌కార్న్, బంగాళా దంప చిప్స్, చాకెట్లు, రేగు పండు జామ్‌. ఇలా ఒకటేమిటి.. అన్నీ నాసిరకమే. చూడగానే ఆకట్టుకునే ప్యాకింగ్‌. ప్యాకెట్‌ విప్పగానే తినేయాలపించేలా రంగులు. మళ్లీ మళ్లీ కొనిపించే గిఫ్ట్‌ ప్యాక్‌లు. రూపాయి ప్యాకెట్‌ నుంచి ఐదు రూపాయల ప్యాకెట్‌ వరకు తయారీ చేసి మార్కెట్‌ చేస్తున్నారు.. కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాసిరకం తినుబండారాలు సరఫరా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీపై అధికారులు సోమవారం దాడులు చేసి సంస్థ యజమాని, అతని అల్లుడిని అదుపులోకి తీసుకుని కంపెనీని సీజ్‌ చేశారు.  

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ):  కొత్తపేట జోడు బొమ్మల సెంటర్‌ ప్రాంతానికి చెందిన ఒగ్గు మురళీకృష్ణ కేఎల్‌రావు పార్కు రోడ్డులో ఆర్‌కే ప్రొడక్ట్‌ పేరిట చిన్నపిల్లల తినుబండారాలను తయారు చేస్తుంటాడు. మురళీకృష్ణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌లను సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు ఆహార పదార్థాల తయారీలో నాణ్యతను పాటించడం లేదనే సమాచారం ట్రాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జి.రాజీవ్‌కుమార్‌కు అందింది. సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం యూనిట్‌పై  ఏసీపీ రాజీవ్‌కుమార్, ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి పూర్ణచంద్రరావు, కొత్తపేట సీఐ మురళీకృష్ణలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. పామాయిల్‌తో పాటు చిన్నపిల్లలు తినే కుర్‌కురే వంటి పదార్థం, పాప్‌కార్న్‌లతో రేగిపండు జామ్‌లను తనిఖీ చేశారు. అందులో వాడే రంగులు, రసాయనాలను పరిశీలించారు. ప్యాకింగ్‌ యూనిట్‌లో ఉన్న మురళీకృష్ణ అల్లుడు వినోద్‌ను సైతం అధికారులు ప్రశ్నించారు. ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే  ముడి సరుకులను ఎక్కడి నుంచి తీసుకువస్తావనే వివరాలను ఎంత అడిగినా వారు చెప్పలేదు.

రెన్యూవల్‌ లేకుండానే..
కంపెనీ నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులు 2016లోనే ముగిసినప్పటికీ రెన్యూవల్‌ చేయించకపోవడం, ట్యాక్స్‌లు సక్రమంగా చెల్లించకపోవడం తదితర విషయాలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గుర్తించి ఆయా విభాగాల అధికారులకు సమాచారం అందించారు. కంపెనీలో ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నట్లు లేబర్‌ లైసెన్సులో ఉండగా, వాస్తవానికి కంపెనీలో 50 మందికి పైగా పనివారు ఉన్నట్లు గుర్తించారు. ఇక సరుకులను మేడపైకి చేరవేసేందుకు ఉపయోగించే లిఫ్టుకు ఎటువంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం, భవనంలోని మూడు అంతస్తులలో ఎక్కడా ఫైర్‌ సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

కంపెనీ ఒక చోట.. సరుకు మరోచోట
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో అతని కంపెనీ వద్ద లారీతో సరుకు దిగుమతి అవుతుంది. సరుకు తాలుకు బిల్లులను డ్రైవర్‌ నుంచి తీసుకుని అధికారులు తనిఖీ చేశారు.  సరుకును సూరంపల్లిలోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని కంపెనీలో దిగుమతి చేయాల్సి ఉండగా కేఎల్‌రావు నగర్‌లో దిగుమతి చేస్తున్నారు. సుమారు రూ. 10 లక్షల విలువ గల సరుకులు ఇక్కడ ఎందుకు దిగుమతి చేస్తున్నారని ప్రశ్నించగా సరైన సమాధానం లేదు. దీంతో అధికారులు బిల్లులను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో రెండు సార్లు దాడులు
రెండేళ్లలో ఈ కంపెనీపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు విజిలెన్స్, టాస్క్‌ఫోర్సు అధికారులు దాడులు చేశారు. ఒక దఫా కార్పొరేషన్‌ ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌ సమక్షంలో దాడులు నిర్వహించారు. అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో కంపెనీలో అపరిశుభ్ర వాతావరణంలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించి కంపెనీని సీజ్‌ చేశారు. సోమవారం కూడా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అన్నిరకాల ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించడంతో పాటు కేసు నమోదు చేసి కంపెనీని సీజ్‌ చేశారు. రవాణాకు సిద్ధంగా ఉన్న రూ. 10 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్‌ల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement