వివరాలు వెల్లడిస్తున్న సీఐ నభీ
అమరావతి, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : స్కూల్‌కు డుమ్మా కొట్టేందుకు అక్కాతమ్ముడు ఓ కట్టు కథ అల్లారు. కొందరు యువకులు తమపై బ్లేడుతో దాడి చేశారంటూ చెప్పడంతో కథ కొంత సేపు రక్తికట్టింది. అయితే, అప్పటికే ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు ఘటనపై నిశితంగా దృష్టి సారించడంతో ఎక్కడో తేడా కొట్టినట్లైంది. దీంతో ఇద్దరినీ రకరకాలుగా విచారించడంతో అసలు వ్యవహారం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గురువారం అక్కాతమ్ముళ్లపై బ్లేడు దాడి జరిగిందన్న ఘటన కలకలం సృష్టించింది. ఈ దాడికి పాల్పడింది ఇరువురు యువకులు అంటూ అక్కాతమ్ముళ్లు చెప్పటంతో నిందితులను పట్టుకునేం దుకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లతో పాటు సందులు గొందుల్లో సైతం తిరిగారు. దాడికి పాల్పడిన యువకుల ఆచూకీ లభించకపోవటంతో పాటు అక్కాతమ్ముళ్లు చెప్పిన వివరాలపై నిశితంగా దృష్టి సారించడంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు చేసేదిలేక జరిగిన విషయాన్ని మీడియా ముందు పెట్టి ముక్కున వేలేసుకున్నారు.
అక్కాతమ్ముళ్లు చెప్పిన కథనం ప్రకారం..
మచిలీపట్నం సర్కిల్‌పేటకు చెందిన చిలకలపూడి నగేష్, ఝాన్సీ భార్యభర్తలు. నగేష్ వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప రామకృష్ణ పబ్లిక్ స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాబు 8వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే గురువారం ఉదయం 9 గంటల సమయంలో అక్కాతమ్ముళ్లు స్కూలుకు బయలుదేరారు. స్కూలు సమీపానికి చేరుకున్న సమయంలో ఇరువురు యువకులు బుల్లెట్‌పై వచ్చి అక్కా తమ్ముళ్లపై బ్లేడుతో దాడి చేశారు. ఇరువురి ఎడమ చేతి మణి కట్టుపై గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. భయంతో అక్కాతమ్ముళ్లు ఇంటికి పరుగు పెట్టారు. జరిగిన విషయాన్ని తల్లి ఝాన్సీకి చెప్పారు. గాయాలపాలైన అక్కాతమ్ముళ్లను చికిత్స నిమిత్తం తల్లితండ్రులు హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కాతమ్ముళ్ల నుంచి వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులపై దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఆ ప్రాంతంలో విద్యార్థులపై దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాలుగానీ, సమాచారంగానీ పోలీసులకు చిక్కలేదు. దీంతో దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
స్కూలుకు బురిడీ కొట్టేందుకే..
విద్యార్థులపై జరిగిన బ్లేడు దాడికి సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం ఇనగుదురుపేట సీఐ ఎస్‌కే నభీ జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. బ్లేడు దాడిలో గాయపడిన అక్కాతమ్ముళ్లు పధకం ప్రకారం ఈ సాహసానికి ఒడిగట్టినట్లు తేలిందని సీఐ తెలిపారు. స్కూలుకు డుమ్మా కొట్టేందుకు తమ్ముడు ఇచ్చిన సలహా మేరకు ఇరువురు ఈ సాహసానికి తెగించినట్లు చెప్పారు. ఇంటి నుంచి బయలుదేరిన అక్కాతమ్ముళ్లు స్కూలు సమీపంలో బ్యాగులోని పదునైన వస్తువుతో ఒకరి చేతులు ఒకరు కోసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేవలం స్కూలు ఎగ్గొట్టాలనే ఆలోచనతో ఈ అనాలోచిత సాహసానికి ఒడిగట్టారే తప్ప బ్లేడు బ్యాచ్ దాడి, యువకుల దాడి కాదని తేల్చి చెప్పారు. తల్లితండ్రులు, పోలీసులు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి నిర్వహించిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై ఈశ్వర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్కూలుకు డుమ్మా కొట్టేందుకు విద్యార్థులు ఇంతటి సాహసానికి ఒడిగట్టడమంటే అనుమానించాల్సిన విషయమేనంటూ పోలీసుల వివరణపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment