ప్రమాదంలో మృతి చెందిన ఉమేష్ ,తీవ్ర గాయాలతో మృతి చెందిన మహేష్
కృష్ణాజిల్లా, కంచికచర్ల (నందిగామ) : బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన ఆదివారం కంచికచర్ల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రికి చెందిన బొడ్డు ఉమేష్ (17) పరిటాల అమ్రితసాయి ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కన్నా మహేష్ అదే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరు ఆదివారం బంధువులను చూసేందుకు ఫెర్రి నుంచి బైక్‌పై కునికెనపాడు గ్రామానికి వెళ్లారు. కొంతసేపు బంధువులలో మాట్లాడి అనంతరం అదేరూట్‌లో తిరిగి ఇంటికి బయలుదేరారు. మండలంలోని నక్కలంపేట సమీపంలోకి రాగానే విజయవాడ వైపు నుంచి హైద్రాబాద్ వైపు వెళ్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. ఉమేష్ అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసమని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డీ చంద్రశేఖర్ తెలిపారు.
ఫెర్రీలో విషాదచాయలు
ఇబ్రహీంపట్నం (మైలవరం) : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. కంచికచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందటంతో ఆ కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిలింది. గ్రామానికి చెందిన బొడ్డు ఉమేష్‌వర్మ, కన్నా మహేష్ చిన్ననాటి నుంచి స్నేహంతో మెలిగారు. విధి వంచనతో మృత్యువులో కూడా ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కన్నా రామయ్య తాపీ పనులు చేసుకుంటూ ఇద్దరు కొడుకులను చదివిస్తున్నాడు. కంచికచర్ల అమృతసాయి కళాశాలలో పెద్ద కుమారుడు మహేష్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చుట్టపుచూపుగా బంధువుల ఇంటికెళ్లి ప్రమాద రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మరో వ్యక్తి బొడ్డు నాగార్జున స్థానిక ఎన్టీటీపీఎస్‌లో రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు ఉమేష్‌వర్మ అమృతసాయి కళాశాలలో డిప్లమో సెకండ్ ఇయర్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులై ఆదుకుంటారని భావించిన తల్లిదండ్రులను విద్యార్థుల మరణవార్త విషాదంలోకి నెట్టింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ కుటుంబాల సభ్యులను ఓదార్చటం ఎవరితరం కావటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment