సాక్షి, అమరావతి బ్యూరో : మచిలీపట్నం శివారుల్లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో సీటు వస్తే చాలు విద్యార్థులు సంబరాలు చేసుకుంటారు. అంతటి చరిత్ర గల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదివే ఓ విద్యార్థిని 15 రోజుల కిందట ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ సైతం రాసింది. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం రూరల్ మండలంలోని ఓ విద్యార్థిని ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. గత నెల రెండో వారంలో సహా విద్యార్థిని కోరిక మేరకు ఆమె రాసిచ్చిన లేఖను ఓ విద్యార్థికి అందజేసింది. ఈ విషయం అధ్యాపకులకు, యాజమాన్యానికి తెలిసింది. ఇద్దరు ప్రేమికుల మధ్య రాయభారం నడిపిందన్న కారణం చూపుతూ.. ఆమె పేరును నోటీసు బోర్డుకెక్కించారు. అంతటితో ఆగకుండా ఆ యువతిని క్లాసు క్లాసుకు తిప్పి.. ఆమె చేసిన తప్పిదాన్ని సహ విద్యార్థులందరికీ వివరించి అవమానించారు.
టీసీ ఇస్తామంటూ బెదిరింపులు..
తల్లిదండ్రులను పిలిపించి టీసీ ఇచ్చి పంపించేస్తామంటూ బెదిరించారు. అప్పటికే తమ కుమార్తెకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు టీసీ ఇవ్వాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో మానసిక వేదనకు గురైన ఆ విద్యార్థిని 15 రోజుల కిందట ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయకుండా మౌనం దాల్చారు.
కేసు ఎందుకు నమోదు చేయలేదు?
స్థానికంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయం పోలీసులకు ఎందుకు తెలియలేదు? ఒకవేళ తెలిస్తే కేసు నమోదు చేయకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది. పైగా విద్యార్థిని సూసైడ్ నోట్ ఏమైంది.? కుమార్తె మరణించినా తల్లిదండ్రులు ఎందుకు మౌనం దాల్చారు? అసలు విషయాలు బయటకు రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? అన్నవి తేలాల్సి ఉంది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తునాయి. పోలీసులకు విషయం తెలిసినా కేసు నమోదు చేయకుండా అటు తల్లిదండ్రులకు.. ఇటు కళాశాల యాజమాన్యానికి రాజీ కుదర్చడం.. రూ.లక్షలు చేతులు మారడంతోనే ఈ విషయం వెలుగులోకి రాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment