'పాల'కూట విషం | Milk Adulteration in Prakasa Dairy | Sakshi
Sakshi News home page

'పాల'కూట విషం

Published Mon, Nov 5 2018 12:29 PM | Last Updated on Mon, Nov 5 2018 12:29 PM

Milk Adulteration in Prakasa Dairy - Sakshi

వ్యర్థాలను వేరు చేసే తొట్టి

కల్తీ..కల్తీ..ఆహారంగా తీసుకునే ప్రతిదీ కల్తీ అవుతోంది. చివరకు పాలను కూడా వదలకుండా కంత్రీగాళ్లు కల్తీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే ముడి సరుకుతో పాలలాంటి పదార్థాన్ని తయారు చేసి అసలు పాలలో కలిపేసి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. కొన్నిసార్లు డెయిరీ నిర్వాహకులు గుర్తించక వాటిని వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో కల్తీ పాలు తాగి జనం అనారోగ్యం పాలవుతున్నారు. గుర్తించిన చోట వాటికి అడ్డుకట్ట వేసేందుకు డెయిరీల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.

ప్రకాశం, దర్శి టౌన్‌: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమే ప్రధాన జీవనాధారం. గ్రామాల్లో నూటికి 70 శాతం పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వారిలో కొందరు కల్తీ పాల తయారీకి పూనుకుంటున్నారు. దీంతో జిల్లాలో కల్తీ పాల తయారీ రోజు రోజుకూ పెరుగుతోంది. అధిక ఆదాయం కోసం అర్రులు చాచే కొందరు పాలను కల్తీ చేస్తున్నారు. పాలను ఎక్కువగా పోసి సొమ్ము చేసుకునేందుకు అర్రులు చాస్తున్నారు.

కల్తీ చేస్తోందిలా..
లీటర్‌ పాలలో మూడు లీటర్ల నీరు కలిపి అందులో సన్‌ఫ్లవర్‌ ఆయిల్, యూరియా, కళ్లు ఉప్పు, చక్కెర, పచ్చి కొబ్బరి నుంచి తయారు చేసిన రసంలో మరికొన్ని మిశ్రమాలను, ఇంకా తెల్లదనం, చిక్కదనం కోసం ఫెవికాల్‌ను వినియోగిస్తున్నారు. దీంతో నాలుగు లీటర్ల పాలు తయారవుతున్నాయి. జిల్లాలో సంతమాగులూరు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు గ్రామాల్లో కల్తీ పాల ఉత్పత్తి జరుగుతోంది. విషయం తెలిసిన పలు డెయిరీలు ఆయా గ్రామాల పాలు తీసుకునే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కల్తీ పాలను ఇలా గుర్తించవచ్చు..
కల్తీ పాలు చూడగానే సాధారణ పాల కన్నా భిన్నంగా మెరుస్తూ ఉంటాయి. కొంత సమయం అయిన తర్వాత పైన నూనె, ఇతర పదార్థాలు తెట్టుగా తేలతాయి. దీంతో పాలు డెయిరీకి వెళ్లే సమయానికి పైన తెట్టు, వాసన కూడా మారతాయి. డెయిరీలో ప్రతి క్యాన్‌ను పరిశీలిస్తే గానీ కల్తీ పాలను పట్టుకోలేరు. 

ఈ విధంగా పరీక్ష చేయాలి..
నేషనల్‌ డెయిరీ డవలప్‌మెంటు వారి కలర్‌ కంపెరిజన్‌ చార్ట్‌ల ద్వారా పాలనుపిప్పెట్టులో పోసి,  కొంత కెమికల్‌ వేసి టైట్రేషన్‌ చేస్తే యూరియా, ఘగర్స్, ఆయిల్, సాల్ట్‌ కంటెంట్‌లు తెలుస్తుంది. దీనికి బట్టి పాల కల్తీ గుర్తించి తర్వాత నుంచి జాగ్రత్త వహిస్తారు.
పాలల్లో మెడికల్‌ షాపులో దొరికే టింక్చర్‌ అయోడిన్‌ను తీసుకుని వేస్తే అవి పసుపు రంగులోనికి మారితే మంచివి. అలాకాక నీలం రంగులోనికి మారితే కల్తీవి.
టెస్ట్‌ ట్యూబ్‌లో టీస్పూన్‌ పాలను తీసుకుని అందులో అర టీస్పూన్‌ కందిపప్పు పిండి కలపాలి. ఐదు నిముషాల తర్వాత పాలలో ఎరుపు లిట్మస్‌ పేపర్‌ను ముంచి అరనిముషం ఉంచాలి. పేపర్‌ ఎరుపు నుంచి నీలం రంగుకు మారితే ఆ పాలలో యూరియా కలిపి ఉన్నట్లు గుర్తించవచ్చు.

బయటపడిన పలు సంఘటనలు...
జిల్లాలో పలు గ్రామాలను పరిశీలిస్తే ఆ గ్రామంలో ఉత్పత్తి అయ్యే పాలకు మిల్క్‌ కేంద్రాల ద్వారా సేకరించే పాలకు చాలా వ్యత్యాసం వస్తుండటంతో ఈ కల్తీ పాల వ్యవహారం బయటకు వచ్చింది. తాళ్లూరు మండలంలో పలు గ్రామాలతో పాటు అద్దంకి, సంతమాగులూరు మండలం ఏల్చూరు, ముండ్లమూరు మండలాల్లో ఈ తంతు జరుగుతోందని పాడి రైతులు వాపోతున్నారు. వారి వలన తమకు కూడా చెడ్డ పేరు వస్తుందని, ఇటువంటివి అరికట్టాలని ముండ్లమూరు, మార్టూరు మండలంలో గతంలో తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. తాళ్లూరులో  పలువురు ఇటువంటి కల్తీ వ్యవహారాన్ని అరికట్టాలని అనేక సార్లు కోరారు.

కేంద్రాలకు తగ్గుతున్న పాలు..
జిల్లాలో 80 పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 4.5 లక్షల లీటర్ల పాలు వస్తుంటాయి. అయితే ఈ కల్తీ పాలను అరికట్టడంతో డెయిరీలు పలు చర్యలు తీసుకోవటంతో అవి 4 లక్షలకు పడిపోయాయి.  దర్శి నియోజకవర్గంలో 20 పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా దాదాపు 1.5 లక్షల లీటర్ల పాలు వస్తుంటాయి. ఇవి కూడా 80 వేల లీటర్లకు పైగా తగ్గాయి.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
కల్తీ పాల తయారీకి ఉపయోగించే పదార్థాలు వినియోగదారుల ఆరోగ్యంపై పూర్తి ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, లివర్, సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపి వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు తగ్గి సోడియం శాతం పెరుగుతుంది. హార్మోన్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు థైరాయిడ్, ఫంగస్‌ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి.

జీవన ప్రమాణాలపై పూర్తి ప్రభావం
కల్తీలో వాడే పదార్థాలు కిడ్నీ, లివర్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. హోర్మోన్లపై ప్రభావం చూపుతాయి. కామెర్లు ఉన్న రోగులు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. యూరియా కిడ్నీ, లివర్‌పై అధిక ప్రభావం చూపుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పూర్తి స్థాయిలో తగ్గుతాయి.– పోకూరి శ్రీనివాస్, న్యూరాలజిస్ట్, నల్లూరి నర్సింగ్‌హోమ్, ఒంగోలు.

కల్తీ పాలతో తీవ్రంగా నష్టపోతున్నాం
డెయిరీల మధ్య అనారోగ్యకరమైన పోటీతో పాల ఉత్పత్తిదారుల వద్దకు అధిక అడ్వాన్స్‌లతో ఆకర్షిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు సోమరి రైతులు తక్కువ పాలు ఉత్పత్తి చేస్తూ కల్తీతో అధిక పాలు పోయటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ గ్రామంలో పాలు పడుతున్న ఏజెంట్‌లు విషయాన్ని గమనించి అనేక చోట్ల నిరోధిస్తున్నారు. దీంతో పాలు తగ్గుతున్నాయి. మొహమాటంతో కొన్ని చోట్ల అదేవిధంగా తీసుకోవటంతో పాలలో కల్తీ వచ్చి మిగిలిన పాలు కూడా పాడవుతున్నాయి. మా డెయిరీలో అయితే నూరుశాతం నిరోధించాం. అయితే ఈ ప్రాంత పాలంటే కల్తీవని  హైదరాబాద్‌ వారికి ఒక చెడు అభిప్రాయం వచ్చింది. దీంతో ఈ ప్రాంత డెయిరీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.– హనుమంతరావు, ఎండీ, సాయిగంగా డెయిరీ, తూర్పు గంగవరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement