గోడౌన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ,పరిశ్రమలో తనిఖీ చేస్తున్న డీఎస్పీ కరీముల్లా షరీఫ్
పరిగి: టీ పొడిలో కల్తీ జరుగుతోందని వదంతులు వ్యాపించాయి. తయారైన టీ పొడిని గుట్టుగా తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కల్తీ గుట్టు తేల్చేందుకు పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్, హిందూపురం రూరల్ సీఐ వెంకటేశులు కలిసి పరిగి ఎస్సై రాంభూపాల్, పోలీసు సిబ్బందితో బుధవారం రంగంలోకి దిగారు. హిందూపురం మధుగిరి ప్రధాన రహదారిలో ప్రికాట్ మిల్లు సమీపంలో ఉన్న గొరవనహళ్లి క్రాస్‌లో చర్మ శుభ్రత కోసం మలేదడెక్ట్ అనే కుటీర పరిశ్రమ నడుస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన మాధవన్ దీని నిర్వాహకుడు. గొర్రెలు, మేకల చర్మాలను శుభ్రపరిచేందుకు అవసరమైన పొడి తయారీకి బదులు కల్తీ టీ పొడి తయారు చేసి తమిళనాడుకు అమ్ముతున్నారని ఆరోపణలు రావడంతో డీఎస్పీ, సీఐలు ఫ్యాక్టరీ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బిల్లు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ కాపీలు, రెన్యూవల్స్ రికార్డులు తనిఖీ చేశారు. గోడౌన్‌లోని తయారీ విధానాన్ని, చర్మం శుభ్రపరిచేందుకు తయారవుతుందంటున్న పౌడరు, తయారీలో వాడే పదార్థాలు, ముడి సరుకు వివరాలను నిశితంగా పరిశీలించారు. పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ల్యాబ్ నివేదిక వచ్చాక ఆరోపణలు రుజువైతే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment