► గుంటూరు ఆటోనగర్‌లో శనివారం భారీగా పట్టుబడిన కల్తీ పచ్చళ్ల డ్రమ్ములు
► కుళ్లిన పదార్థాలతో తయారీ
► నిర్వాహకుడిని కాపాడేందుకు రంగంలోకి పిడుగురాళ్ల టీడీపీ నాయకుడు
► వరుస ఘటనలతో ప్రజానీకం ఆందోళన
కల్తీ ఆహార పదార్థాలకు జిల్లా అడ్డాగా మారుతోంది. ‘కల్తీలకు కాదేది అనర్హం’ అన్న రీతిలో జిల్లాలో కల్తీ జరుగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు దందా కొనసాగిస్తూ డబ్బు దండుకుంటున్నారు. వారికి అధికార పార్టీ నేతలు దన్నుగా నిలవడంతో వారి వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.
సాక్షి, అమరావతి బ్యూరో: కారం, నెయ్యి, బియ్యం, కంది పప్పు, చికెన్, టీపొడి మొదలు కుళ్లిన పచ్చళ్లను సైతం విక్రయిస్తున్నారు అక్రమార్కులు. శుక్రవారం రాత్రి గుంటూరు ఆటోనగర్ శివారు ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి 200 డమ్ముల్లో కల్తీ పచ్చళ్లు పట్టుకోవడం ఒక్కసారిగా జిల్లాను భయభ్రాంతులకు గురిచేసింది. పట్టుబడిన పచ్చళ్లు బూజు పట్టి ఉండి, బ్యాక్టీరియా చేరి కంపుకొడుతుండటం గమనార్హం.
పచ్చళ్లలో కల్తీ కారం, రోడామిన్–బి వంటి హానికర పదార్థాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు కల్తీ పచ్చళ్లకు సంబంధించి , ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో తొమ్మిది శాంపిల్స్ తీసి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, శాంపిల్ ఫలితాలు వచ్చాక కేసులు నమోదు చేస్తామని మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. ఆటోనగర్‌లో పట్టుబడిన పచ్చళ్లకు సంబంధించి పుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేయకుండా పచ్చళ్లు వాడిన వినియోగదారుడు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని, తప్పిచేయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రంగంలోకి పిడుగురాళ్ల నేత...
కల్తీ పచ్చళ్ల వ్యవహారం నుంచి సంబంధిత వ్యాపారిని గట్టెక్కించేందుకు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ నేత రంగంలో దిగి కేసు నమోదు కాకుండా చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫుడ్ సెఫ్టీ , పౌర సరఫరాలు, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ, తూనికలు కొలతల శాఖ అధికారులు కల్తీ పచ్చళ్ల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో మంగళగిరిలో కల్తీ పచ్చళ్ల స్థావరాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి రెండు నామూనాలను హైదరాబాద్ నాచారం ల్యాబ్‌కు, మిగిలిన నాలుగు శాంపిళ్లను గుంటూరు మెడికల్ కాలేజిలోని రీజినల్ ల్యాబ్‌కు పంపారు. హైదరాబాద్‌కు పంపిన రెండు శాంపిళ్లలో ఒకటి హానికరమని, వాటిలో ఎరిత్రోసిన్ అనే హానికర పదార్థం ఉన్నట్లు తేలింది. మరో శాంపిల్‌లో మిస్ బ్రాండెడ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ కోన శశిధర్ స్పందించి కల్తీ దందాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.
కల్తీ కారం కథ కంచికి..
గతేడాది అధికారులు కోల్డ్‌స్టోరేజీలపై దాడులు నిర్వహించి రూ.కోట్ల విలువైన కల్తీ కారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ వ్యాపారానికి సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, జైలుకు పంపుతామని జిల్లాకు చెందిన ఓ మంత్రి, అధికారులు కలిసి హడావిడి చేసి తర్వాత పట్టించుకోలేదు.
87 నామూనాలు తీసి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా వాటిలో 30 నామూనాలు ప్రజారోగ్యానికి హానికరమని నివేదికలు వచ్చినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. దీనివెనుక పెద్ద ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ రెండు, మూడు రోజుల నుంచి కల్తీ పచ్చళ్ల బాగోతం కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏం కొనాలో? ఏం తినాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.